కరోనా మహమ్మారి భారత వృద్ధి రేటు అంచనాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఐఎంఎఫ్ డైరెక్టర్ (ఆసియా, పసిఫిక్) చాంగ్ యాంగ్ రీ పేర్కొన్నారు. భారత్‌లో కరోనాను ఇంకా నియంత్రించాల్సి ఉందని చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ మందగమనం, కరోనాకు సంబంధించిన అనిశ్చితుల వల్ల స్వల్పకాలిక వృద్ధి అంచనాలపై సందేహాలు పెరిగాయన్నారు. 2020లో భారత వృద్ధి రేటు మైనస్ 4.5 శాతానికి పడిపోవచ్చునని ఇటీవల ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. 1961 తర్వాత ఇది అత్యల్పమని, వినియోగదారుల విశ్వాసం దెబ్బతినే అవకాశముందని కూడా పేర్కొంది.

భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదని, ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని చాంగ్ యాంగ్ తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వృద్ధి రేటు మరింద దిగజారే అవకాశముందని తెలిపారు. ఇటీవలి వరకు సుదీర్ఘ లాగ్ డౌన్ కొనసాగిందని, మొదట ప్రకటించిన లాక్ డౌన్‌ను కొనసాగించారని, అలాగే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెప్పారు. కరోనా ప్రభావం ఆతిథ్య రంగంపై భారీ ప్రభావం చూపాయని తెలిపారు.

చైనా-భారత్ ఉద్రిక్తతలపై ప్రశ్నించగా..
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా నిలవాలని అభిప్రాయపడ్డారు. ఉద్దీపనల ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే అవకాశముందని, అయితే కరోనా కేసులు పెరుగుతుంటే ఇది సాధ్యం కాని పని అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఉద్రిక్తతపై ప్రశ్నించగా.. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సమైక్యతను మరింత పెంచడం ద్వారా భారత్‌లో పెట్టుబడులకు, వృద్ధి, ఉద్యోగాలు-ఉపాది కల్పనకు సహకరిస్తుందన్నారు. వాణిజ్య వివాదాల తీవ్రతను అందరూ నివారించుకోవాలని అభిప్రాయపడ్డారు.

2019లో ఆసియా వాటా 68 శాతం
ఆసియా ఆర్థిక వ్యవస్థ ఈసారి భారీగా క్షీణించనుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఆసియా ఎకనమిక్ ఔట్ పుట్ నష్టం 2022 వరకు కొనసాగవచ్చునని తెలిపింది. 2019లో ప్రపంచ వృద్ధిలో ఆసియా కాంట్రిబ్యూషన్ 68 శాతంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదని అభిప్రాయపడింది. ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితి కేంద్ర బ్యాంకుల రుణాలు, ప్రభుత్వం నిర్ణయాలు, ఉద్దీపనలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications