అమ్మయ్య! లాభాల్లోకి ప్రపంచ మార్కెట్లు, కారణాలివే.. భారత్‌పై ప్రభావం
కరోనా మహమ్మారి దెబ్బకు వేలమంది మృత్యువాత పడటంతో పాటు ఆర్థికంగా కూడా ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు గత రెండు నెలలుగా కుప్పకూలుతున్నాయి. కొన్ని దేశాల్లో మరణాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రపంచ మార్కెట్లు సోమవారం కాస్త కోలుకున్నాయి. అధఇకంగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల సమావేశం వాయిదా అనంతరం ముడి చమురు ధరలు అడుగంటాయి.

మార్కెట్లకు ఈ వార్తలు సానుకూలం
వివిధ దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం వంటి వివిధ కారణాలతో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుందని ఐరోపా దేశాల నుండి వచ్చిన సానుకూల వార్తలు మార్కెట్లకు ఊరటనిచ్చాయి. రెండు వారాలుగా మరణాలు తగ్గాయని ఇటలీ, వరుసగా మూడో రోజు మరణాల సంఖ్య తగ్గిందని స్పెయిన్ వెల్లడించింది. వారం రోజులుగా తక్కువ మరణాలు సంభవించాయని ఫ్రాన్స్ ప్రకటించింది.

లాక్ డౌన్ ఎత్తివేత దిశగా..
ప్రపంచంలోనే అతి ఎక్కువ కేసులు నమోదయింది అమెరికాలో. ఇక్కడ ఇటీవలి కాలంలో మరణాలు భారీగా పెరిగాయి. అయితే కేసులు సంఖ్యలో స్థిరీకరణ లేదా తగ్గుదల సంకేతాలు వచ్చాయి. ఈ మేరకు అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే, ఇన్నాళ్లు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో దీనిని ఎత్తివేయాలని వివిధ దేశాలు భావిస్తున్నాయి. ఇవన్నీ మార్కెట్లకు సానుకూల సంకేతాలు పంపిస్తున్నాయి. భారత్‌లోను 14న లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా తెలియనప్పటికీ.. వెసులుబాటు మాత్రం ఇస్తారని భావిస్తున్నారు.

వచ్చే నెల నాటికి గాడిలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నియంత్రణలోకి వచ్చాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ నెల చివర లేదా మే ప్రారంభం నాటికి గాడిన పడవచ్చునని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సోమవారం వివిధ దేసాల మార్కెట్లు కాస్త ముందుకు కదిలాయి.

అమెరికా సహా ఆయా దేశాల మార్కెట్ల దూకుడు
కరోనా మహమ్మారి సంకేతాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లలో ఆశావాద దృక్పథం కనిపించింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1627 పాయింట్లు (8 శాతం) ఎగిసింది. స్టాండర్డ్ అండ్ పూర్స్ 500, నాస్‌డాక్‌లు 7 శాతం చొప్పిన పెరిగాయి. ఫ్రాంక్‌ఫర్ట్ 6 శాతం, ప్యారిస్ 5 శాతం, లండన్ 3 శాతం ఎగిసింది. జపాన్ నిక్కీ ఇండెక్స్, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ, ఏఎస్ఎక్స్ (రెండు) 4 శాతం చొప్పున పెరిగాయి. హాంగ్‌కాంగ్ 2 శాతం పెరిగాయి.

భారత మార్కెట్లకు దూకుడు?
అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో దూకుడు నేపథ్యంలో ఈ ప్రభావం భారత్ పైన ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఏప్రిల్ మొదటి వారంలో పరిస్థితులు తెలుస్తాయని చాలామంది భావించారు. మర్కజ్ నుండి వచ్చిన వారి వల్లే మరింతమందికి వ్యాప్తించలేదని దాదాపు స్పష్టమవుతోంది. ఈ వారంలో కేసులు భారీగా పెరిగాయి. మర్కజ్ నుండి వచ్చిన వారి కారణంగానే ఈ వారంలో 50 శాతం కేసులు పెరగడం, గత నెల 18, 19 తారీఖుల్లో వారి ఇళ్లకు తిరిగి రాగానే జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రకటన వరుసగా ఉన్న నేపథ్యంలో పెద్దగా మరింత వేగంగా కేసులు పెరగకపోవచ్చునని భావిస్తున్నారు. ఇవన్నీ భారత మార్కెట్లకు దూకుడు పెంచవచ్చునని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications