PNB: బ్యాంకులో రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు.. షాకవుతున్న ఖాతాదారులు..!
సాధారణంగా నకిలీ నోట్లు ప్రజల వద్ద చలామణిలో ఉంటాయి. కానీ ఓ బ్యాంకులోనే భారీగా దొంగ నోట్లు బయటపడడం సంచలనం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.7 కోట్లకు పైగా ఫేక్ కరెన్సీని గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్ సహారన్‌పుర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని (PNB) కరెన్సీ చెస్ట్‌లో దాదాపు రూ.7.40 కోట్ల నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ముగ్గురు బ్యాంకు అధికారులతో పాటు ఓ హౌస్‌కీపర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. పీఎన్‌బీ సీనియర్ డివిజనల్ మేనేజర్ రవి కుమార్ కేస్, కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ, అమిత్ కుమార్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆగస్టు 5న PNB కరెన్సీ చెస్ట్ నుంచి RBI జైపూర్ చెస్ట్‌కు దాదాపు రూ. 11.50 కోట్ల విలువైన నగదును తరలించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జైపూర్ చెస్ట్‌లో నగదు లెక్కింపు సమయంలో రూ. 4,30,900 తక్కువగా ఉన్నట్లు గుర్తించి, PNB మీరట్ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత, ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు బ్యాంకు చీఫ్ మేనేజర్, దర్యాప్తు అధికారి అయిన అరుణ్ కుమార్ చౌబేను సహరాన్‌పూర్‌కు పంపారు. కరెన్సీ చెస్ట్‌లో పార్ట్-టైమ్ హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్న విశాల్ కుమార్ ఈ పనిలో ప్రమేయం కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది.

కరెన్సీ నోట్ల కట్టలను సర్దడం లేదా అమర్చడం వంటి బాధ్యత విశాల్‌కు అప్పగించారు. అతను నోట్ల కట్టల నుంచి నగదును దొంగిలిస్తున్నట్లు CCTV కెమెరాల్లో కూడా రికార్డయింది. నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించిన తర్వాత, బ్యాంకు ఆగస్టు 9న కరెన్సీ చెస్ట్‌పై సమగ్ర ఆడిట్‌ను ప్రారంభించింది. నోట్ల లెక్కింపు, పరిశీలన సమయంలో దర్యాప్తు అధికారులు భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని గుర్తించారు.
సోమవారం నాడు గుర్తించిన నకిలీ నోట్ల విలువ సుమారు రూ. 7.40 కోట్లుగా అంచనా వేశారు. కానీ విచారణ సాగుతున్న నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. ఫేక్ కరెన్సీ రూ. 17 కోట్లకు చేరుకోవచ్చని సమాచారం. బ్యాంకు ద్వారా కరెన్సీకి సంబంధించిన సమగ్ర ఆడిట్ ఇంకా కొనసాగుతోంది.
విచారణ సమయంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ రవి కుమార్ కాన్సే, కరెన్సీ చెస్ట్ మేనేజర్ సుశీల్ కుమార్, యమునానగర్-జగాధ్రి (హర్యానా) కరెన్సీ చెస్ట్ మేనేజర్ అమిత్ కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. దర్యాప్తు అధికారులు ఈ విషయంపై వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. సస్పెండ్ చేసిన ప్రమేయం ఎంతవరకు ఉంది. నకిలీ నోట్లు కరెన్సీ చెస్ట్‌కు ఏ విధంగా చేరాయి అనే విషయాలు విచారణ పూర్తయిన తర్వాతే వెల్లడవుతాయి. ఇదిలా ఉండగా జైపూర్‌కు పంపిన ఒక కరెన్సీ సరుకులో లక్షల రూపాయల లోటు బయటపడటంతో, పార్ట్‌టైమ్ హౌస్‌కీపర్ విశాల్ కుమార్‌పై చర్య తీసుకున్నారు. బ్యాంకు అంతర్గత విచారణ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, అతను నోట్ల కట్టల నుంచి నగదును తీసివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. హౌస్‌కీపర్ దొంగతనానికీ, కరెన్సీ చెస్ట్‌లో కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ దొరకడానికీ మధ్య ఏదైనా సంబంధం ఉందా, లేదా ఈ రెండు సంఘటనలకు సంబంధం లేదా అనే విషయాన్ని పోలీసులు ఇప్పుడు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు డీఐజీ అభిషేక్ చెప్పారు. ఈ నకిలీ కరెన్సీని ఎవరు చేర్చారనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications