RBI News: గతంలో కాకుండా ఇప్పుడు ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత సేవింగ్స్ సహా ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో వాల్యూమ్స్ పెరుగుతూ పోతున్నాయి. ఈ పోకడపై అటు సెబీ నుంచి ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది. దాని కట్టడి కోసం పలు చర్యలు చేపట్టింది. కాగా ఇప్పుడు ఆ లిస్టులో RBI వచ్చి చేరింది. దీంతో ఈసారి బడ్జెట్‌లో వీటిపై అనౌన్స్‌మెంట్స్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రజలు తమ పొదుపును ఇన్వెస్ట్ చేసేందుకు క్యాపిటల్ మార్కెట్‌లను ఎంచుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. బ్యాంకుల్లో పార్క్ చేయడం లేదా పెట్టుబడి పెట్టడం కంటే మార్కెట్స్‌ను మెరుగైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు. మోడరన్ BFSI (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్) సమ్మిట్ 2024లో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతీయ కుటుంబాలు సాధారణంగా పెట్టుబడులకు బ్యాంకులను మొదటి ఎంపికగా చూసేవని దాస్ గుర్తు చేశారు. కానీ కాలం మారుతున్న క్రమంలో క్యాపిటల్ మార్కెట్‌లు మరియు ఇతర ఆర్థిక మధ్యవర్తులకు ప్రాధాన్యత పెరుగుతన్నట్లు తెలిపారు. ఈ విషయంలో వినియోగదారుల ప్రవర్తనలో గుర్తించదగిన మార్పు కనిపించినట్లు పేర్కొన్నారు. మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల మంచి రాబడులే కాకుండా పలు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లిభిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
సాంప్రదాయ పెట్టుబడి సాధనాల నుంచి దూరంగా మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర సేవింగ్స్ పథకాల్లోకి ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రవాహం పెరుగుతూ పోతోందని RBI గవర్నల్ వెల్లడించారు. ఈ మార్పు బ్యాంకింగ్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపించనున్నట్లు చెప్పారు. క్రెడిట్ మరియు డిపాజిట్ల మధ్య అంతరాన్ని తగ్గించడానికి బ్యాంకులు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని సూచించారు.
ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో పెరుగుతూ పోతున్న ధోరణిపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. హెడ్జింగ్ కోసం ఉద్దేశించిన ఫ్రేమ్‌వర్క్‌ను స్పెక్యులేషన్ పంథాలో ఉపయోగించడం సరికాదని భావిస్తోంది. కాగా ఈ రెండు వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. దీంతో రానున్న రోజుల్లో కీలక మార్పులు జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications