ఆహార వస్తువుల ధరలకు తోడు చమురు ధరలు ఎగిసిపడటంతో సీపీఐ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నెలలో మూడు నెలల గరిష్టాన్ని చేరుకుంది. జనవరి నెలలో 4.06 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నెలకు 5.03 శాతానికి ఎగబాకింది. 2020 నవంబర్ నెలలో ఇది 6.93 శాతంగా ఉంది. జనవరి నెలలో పారిశ్రామిక రంగం కూడా నేలచూపులు చూసిన విషయం తెలిసిందే. యంత్ర పరికరాలు, తయారీ, గనుల రంగాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో పారిశ్రామిక రంగం మైనస్ 1.6 శాతం ప్రతికూలత నమోదు చేసింది. రిటైల్ ద్రవ్యోల్భణం కూడా మళ్లీ నిరాశపరిచింది.

పెరుగుదల ఇలా
ఫిబ్రవరిలో ఆహార ధరలు 3.87 శాతం వరకు పెరిగాయి. జనవరిలో ఇవి 1.89 శాతంగా మాత్రమే ఉన్నాయని NSO గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరిలో ఇంధన ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 3.53 శాతానికి పెరిగింది. నూనెలు-కొవ్వులు ధరలు 19.71 శాతం నుండి 20.78 శాతానికి, పండ్లు 6.28 శాతానికి పెరిగాయి. కూరగాయల ధర జనవరిలో 15.84 శాతం తగ్గితే ఫిబ్రవరిలో 6.27 శాతం మేర తగ్గాయి. పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, పప్పు ఉత్పత్తులు, గుడ్ల ధరలు వరుసగా 2.59 శాతం, 12.54 శాతం, 11.13 శాతం వరకు పెరిగాయి. జనవరిలో ఈ ద్రవ్యోల్బణం 2.73 శాతం, 13.39 శాతం, 12.85 శాతంగా నమోదయింది.

ద్రవ్యోల్భణ కట్టడిలో..
దేశంలో ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐ సఫలమయింది. 2016 అక్టోబర్ నుండి 2020 మార్చి మధ్య కాలంలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం సగటు 3.9 శాతంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నాయకత్వంలోని ద్రవ్య విధాన కమిటీ(MPC) గత 5 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణం తీరుతెన్నులను సమీక్షించి రాబోయే అయిదేళ్లకు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్ణయించేందుకు మార్చి 31న సమావేశం కానున్న నేపథ్యంలో ఇది సానుకూల పరిణామమే. వినియోగ ధరల ద్రవ్యోల్బణాన్ని రెండు శాతం ఎగువకు, దిగువకు సద్దుబాటు చేసుకునే వెసులుబాటుతో నాలుగు శాతానికి కట్టడి చేయాలని MPCకి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.

బోఫా నివేదిక
ద్రవ్యోల్బణ ఆటుపోట్ల సూచీ 2012-16 మధ్య కాలంలోని 2.4 శాతంతో పోల్చితే గత 5 ఏళ్ల కాలంలో 1.4 శాతంగా నిలిచింది. ఆర్బీఐ గణాంకాల ఆధారంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తాజా నివేదికలో ఈ వివరాలు పొందుపరిచింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం వద్ద ఉండవచ్చునని అంటున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో అది 6.2 శాతంగా ఉంది. వినియోగధరల సూచీలో ఆహార వస్తువుల వాటా 45.9 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications