రూ.76.15 వద్ద రికార్డ్ స్థాయికి రూపాయి పతనం: మార్కెట్ కల్లోలం.. ట్రేడింగ్ పూర్తిగా నిలిపివేస్తారా?
కరోనా మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రూపాయి కూడా రోజురోజుకు బలహీనపడుతోంది. తొలిసారి డాలర్ మారకంతో రూపాయి 76ను దాటింది. అంతకుముందు సెషన్‌లో 75.19తో క్లోజ్ అయింది. ఈ రోజు (సోమవారం, మార్చి 23) 76.15కు పడిపోయింది. ఈ రోజు 75.69 వద్ద ఓపెన్ అయింది.

రూపాయి అందుకే బలహీనం..
ప్రస్తుత తీవ్ర ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో త్వరలో రూపాయి 77కు చేరుకున్నా ఆశ్చర్యం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయాలతో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్ 26.11కు చేరుకోవడం, ఫారన్ ఇన్వెస్టర్స్ స్టాక్స్ అమ్మివేయడం వంటి వివిధ కారణాలు రూపాయిని బలహీనపరుస్తున్నాయని చెబుతున్నారు.

ట్రేడింగ్ నిలిపేసినా కోలుకోని సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు కూడా ఈ రోజు భారీగా నష్టపోయాయి. కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 2600 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కాసేపటికే 10 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరుకోవడంతో సెన్సెక్స్ 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. తిరిగి ప్రారంభమైనప్పటికీ మార్కెట్లు కోలుకోలేదు. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 3,500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా వెయ్యి పాయింట్లు కోల్పోయింది.

మార్కెట్లు పూర్తిగా నిలిచిపోయేనా?
మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ కనుక 15 శాతం మేరకు నష్టపోతే మార్కెట్లు నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సెన్సెక్స్ లోయర్ సర్క్యూట్‌కు చేరుకొని ఓసారి నిలిచింది. మధ్యాహ్నం లోపు పదిహేను శాతానికి పడిపోతే పూర్తిగా నిలిచిపోనున్నాయి.

కరోనా దెబ్బ
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. విదేశాల నుండి వచ్చిన వారి కారణంగా ఇది వ్యాప్తి చెందుతోంది. ఇది వ్యాప్తించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో సోమవారం నాటికి కరోనా కేసులు 400 దాటాయి. మృతుల సంఖ్య 8కి చేరుకుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూలిపోవడం, ప్రపంచ దేశాల్లో కరోనా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం భారత మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి.


Click it and Unblock the Notifications