ముంబై: అమెరికా డాలర్‌తో భారత రూపాయి విలువ గురువారం భారీగా పడిపోయింది. రూపాయి ఏకంగా 82 పైసలు దిగజారి 74.50 వద్ద ట్రేడ్ అయింది. ప్రపంచ ఆరోగ్య సమితి కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మన రూపాయి విలువ పడిపోతోంది.

రూపాయి ఆల్ టైమ్ హై
డాలర్ మారకంతో రూపాయి ఏకంగా రూ.74.50కి చేరుకొని ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 74.48 వద్దనే ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 2018 అక్టోబర్ 11వ తేదీన రూపాయి ఈ రికార్డును చేరుకుంది. ఇప్పుడు దీనిని అధిగమించింది.

ఎన్నడూ లేని విధంగా దెబ్బ
భారత, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు గురువారం విలవిల్లాడాయి. కరోనా వైరస్ కారణంగా నాలుగున్నర వేలమందికి పైగా మృత్యువాతపడ్డారు. లక్షలాది మందికి ఇది సోకింది. రష్యా-సౌదీ అరేబియా మధ్య చమురు ధరల యుద్ధం ప్రారంభమైంది. ఈ దెబ్బ మార్కెట్ సెంటిమెంట్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతీసింది!

నిఫ్టీ బేజారు..
నిఫ్టీ 10,000 మార్క్ కంటే తక్కువకు దిగజారి రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. కరోనా వైరస్ దెబ్బతో నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, వేదాంత, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ తదితర స్టాక్స్ అన్ని కూడా ఉదయం గం.10.30 సమయానికి 8.70 శాతం నుండి 11.98 శాతం మధ్య పడిపోయాయి. నిఫ్టీలో చాలా షేర్లు 52 వారాల కనిష్టానికి దిగజారాయి.

పడిపోయిన రిలయన్స్
సెన్సెక్స్ అక్టోబర్ 2018 కనిష్టానికి దిగజారింది. సెన్సెక్స్‌లో భారీగా నష్టపోయిన స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి. ముఖ్యమైన స్టాక్స్ అన్నీ కలిపి దాదాపు 800 పాయింట్ల వరకు పడిపోయాయి. క్రూడాయిల్ ధరలు 4 శాతం పడిపోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 9 శాతం మేర పడిపోయి రూ.1,049 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాస్త కుదురుకొని గం.10.48కు రూ.1,080 వద్ద ఉంది. 6 శాతానికి పైగా పడిపోయింది.


Click it and Unblock the Notifications