దెబ్బ మీద దెబ్బ: ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న ఐరోపా కీలక దేశం
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,36వేల మంది మృతి చెందారు. ఇరవై లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతోంది. పలుదేశాలు సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయి. ఐరోపాకు ఆర్థిక చోదక శక్తి జర్మనీ మాంద్యం గుప్పిట్లోకి వెళ్లింది. గత నెలలోనే జర్మనీ ఆర్థిక పరిస్థితులు మాంద్యం కోరల్లో చిక్కుకున్నట్లు బుధవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

జర్మనీ పరిస్థితి దారుణం
వ్యాపార, పారిశ్రామికరంగాల్లో విక్రయాలు, ఉత్పత్తి నిలిచిపోయాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు. ఇటీవల 1.1 లక్షల కోట్ల యూరోల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయినా ఫలితం లేకుండా పోతోందట. 7.25 లక్షల సంస్థలు ఆర్థిక సాయాన్ని కోరుతున్నాయి. దాదాపు 21 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఇలా సంక్షోభంలోకి..
కరోనా పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపాయని, దీంతో గత నెలలోనే మాంద్యంలోకి వెళ్లామని, ఇది ఈ ఏడాది మధ్య వరకు కొనసాగవచ్చునని ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిందని, సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. కస్టమర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం లేదని తెలిపింది. అన్నీ కలిపి కీలక ఎగుమతులు పడిపోయి జర్మనీని సంక్షోభంలోకి నెట్టినట్లు తెలిపింది.

వరుస దెబ్బలు..
యూరోప్‌లో బిగ్గెస్ట్ ఎకానమీ జర్మనీదే. ఇప్పటికే గత ఏడాది ట్రేడ్ వార్, బ్రెగ్జిట్ ప్రభావం పడింది. దీని నుండి బయటపడుతోన్న సమయంలో జర్మనీకి కరోనా రూపంలో మరో దెబ్బ తగిలింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు జర్మనీ ఆంక్షలను మే 3వ తేదీ వరకు పొడిగించింది.


Click it and Unblock the Notifications