కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత వారం, నిన్న (మార్చి 16 సోమవారం) భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం కాస్త కోలుకున్నట్లుగా కనిపించాయి. చివరకు మళ్లీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అయితే గత వారంలోని సోమ, గురు, నిన్నటి నష్టాలతో పోల్చుకుంటే తగ్గాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో అమెరికా మార్కెట్లు లాభాల్లోకి రావడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల హింట్ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లు కాసేపు లాభాల్లోనే ఉన్నాయి.

రూ.6 నుండి రూ.57కు ఎగిసిన యస్ బ్యాంకు షేర్
మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పుడు ఆర్బీఐ మారటోరియం విధించడంతో యస్ బ్యాంకు షేర్లు ఓసమయంలో రూ.6కు పడిపోయాయి. కానీ యస్ బ్యాంకును ఆదుకుంటామని కేంద్రం, ఆర్బీఐ ప్రకటించడం, ఇతర బ్యాంకులు పెట్టుబడికి ముందుకు రావడంతో యస్ బ్యాంకు షేర్లు జోరుమీద ఉన్నాయి. పదిహేను రోజుల క్రితం రూ.6గా ఉన్న బ్యాంకు షేర్ ఇప్పుడు (ఈ వార్త రాసే సమయానికి) రూ.57.70కి చేరుకుంది.

వెయ్యి శాతం పెరిగిన యస్ బ్యాంకు షేర్
మార్చి 6వ తేదీన ఈ స్టాక్స్ షేరుకు రూ.5.50గా ఉంది. మంగళవారం ఓ సమయంలో రూ.61కి చేరుకున్నాయి. ఏడు సెషన్లలో 1000 శాతానికి పైగా ఈ షేర్ ధర పెరిగింది. అప్పటికే వివిధ దశల్లో యస్ బ్యాంకుకు అండగా ఉండేందుకు బ్యాంకులు, వ్యవస్థలు ముందుకు వచ్చాయి. తాజాగా సోమవారం ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేశారు. దీంతో మంగళవారం షేర్లు దూసుకెళ్లాయి. ఈ రోజు ఏకంగా 55 శాతం పెరిగాయి.

నష్టాలు.. లాభాలు.. నష్టాలు
గత నెల రోజుల్లో నిఫ్టీ 23 శాతం పడిపోయింది. అయితే మంగళవారం ఓ దశలో 1.49 శాతం పెరిగింది. సెన్సెక్స్ 1.28 శాతం పెరిగింది. అయితే ఆ తర్వాత తిరిగి మళ్లీ పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల నష్టంలోకి, నిఫ్టీ 9000 పాయింట్ల సమీపానికి చేరుకుంది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చి చివరి గంట ముందు వరకు అలాగే ఉండి, ఆ తర్వాత నష్టాల్లోకి చేరుకున్నాయి. స్టాక్స్ అన్నీ నష్టాల్లో ఉండగా యస్ బ్యాంకు షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications