కరోనా ఎఫెక్ట్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పతనం.. ఎందుకిలా?

కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావం అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. రాత్రవగానే అమెరికాలో స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం అయ్యాయనే వార్తలు.. ఉదయం 10 గంటలు అవగానే మన స్టాక్ మార్కెట్లలో సూచీల పతనం. గత రెండు మూడు వారాలుగా ఇదే తంతు. శని, ఆదివారాలు మినహా వారంలో మిగిలిన అన్నిరోజులూ మదుపరులకు కంటికి కునుకు ఉండడం లేదు.

రేపు ఎంత నష్టాలు చూడాల్సి వస్తుందో అనే దిగులుతో రాత్రంతా కంటికి కునుకురాదు. ఉదయం స్టాక్ మార్కెట్లు మొదలయ్యాక ఈరోజు ఏం జరుగుతుందో అనే దిగులు. ఒకటి, రెండు రోజులు అయితే పర్వాలేదు కానీ, కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైనప్పట్నించి ఇదే గొడవ. అసలు స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి? కరోనా వైరస్‌కి స్టాక్ మార్కెట్లకు సంబంధం ఏమిటి?

అందరిలోనూ భయం.. అదే కొంపముంచుతోంది...

అందరిలోనూ భయం.. అదే కొంపముంచుతోంది...

కరోనా వైరస్ భయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి విస్తరిస్తున్న కొద్దీ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు కష్టకాలం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో ఎంత పెద్ద కంపెనీలైనా మెరుగైన ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం ఉండదు. పైగా ఈ ప్రభావం కొన్ని రోజులు మాత్రమే కాదని, రాబోయే రెండు, మూడు త్రైమాసికాలపాటు ఉంటుందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. దీంతో విదేశీ సంస్థాగత మదుపరులు తమ వద్ద ఉన్న షేర్లను అవకాశం ఉన్న మేరకు తెగనమ్మేందుకు సిద్ధపడుతున్నారు. ఈ షేర్ల అమ్మకాల ప్రభావమే స్టాక్ మార్కెట్లపై పడి.. సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలుతున్నాయి.

జోరుగా ఈక్విటీ షేర్ల అమ్మకాలు...

జోరుగా ఈక్విటీ షేర్ల అమ్మకాలు...

సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలడానికి, దాదాపు 500కు పైగా షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి పతనం కావడానికి వెనుక ఉన్న ప్రధాన కారణం విదేశీ సంస్థాగత మదుపరులు తమ వద్ద ఉన్న ఆయా కంపెనీల ఈక్విటీ షేర్లను అమ్మేయడమే. పైగా పెద్ద కంపెనీలకుండే ఇమేజ్ కూడా ఇప్పుడు వాటి షేర్ల విలువను కాపాడలేకపోతోంది. విదేశీ సంస్థాగత మదుపరులు లార్జ్ క్యాప్ (పెద్ద కంపెనీలు) షేర్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఈ లార్జ్ క్యాప్ షేర్లు ప్రధానంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 100 తదితర సూచీల్లో ఉంటాయి. విదేశీ సంస్థాగత మదుపరులు ఈ సూచీల్లో ఉండే కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులు పెట్టడం ఆనవాయితీ.

రోజూ రూ.4 వేల కోట్లకుపైగా అమ్మకాలు!

రోజూ రూ.4 వేల కోట్లకుపైగా అమ్మకాలు!

గత పది రోజుల లెక్కలు తీసుకుంటే.. స్టాక్ మార్కెట్‌లోని నగదు విభాగంలో రోజూ సగటున రూ.4 వేల కోట్లకు పైగా విక్రయాలు జరుగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు ఈ నెలలో ఇప్పటి వరకు రూ.43,274 కోట్ల మేర షేర్లు విక్రయించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో చాలా దేశాల్లో షట్‌డౌన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈక్విటీ షేర్లపై పెట్టుబడులు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అంతేకాకుండా రోజులు గడిచేకొద్దీ పెట్టుబడుల విలువ వేగంగా క్షీణించే ప్రమాదమూ లేకపోలేదు. అందువల్లనే వచ్చిందే చాలనుకుంటూ విదేశీ మదుపుదారులు తమ వద్ద ఉన్న ఈక్విటీ షేర్లను అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. దీంతో ఈ ప్రభావం ఆయా సూచీలపై పడి అవి కుప్పకూలుతున్నాయి. ఇంత వేగంగా, ఇంత అధికంగా స్టాక్ మార్కెట్ సూచీలు క్షీణించడం గత కొన్నేళ్లలో ఎన్నడూ జరగలేదు. పది రోజుల వ్యవధిలో సెన్సెక్స్, నిఫ్టీలు 35 శాతం వరకు క్షీణించాయంటే దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాళ్లు అమ్మేస్తుంటే.. వీళ్లు కొంటున్నారు...

వాళ్లు అమ్మేస్తుంటే.. వీళ్లు కొంటున్నారు...

కరోనా వైరస్ దెబ్బకు భయపడి విదేశీ సంస్థాగత మదుపరులు ఈక్విటీ షేర్లను ఎంతకో అంతకు వదిలించుకుంటుండగా.. అదే సమయంలో దేశీయ మదుపరులు వాటిని కొంటున్నారు. ఇది కొంతలో కొంత నయం. లేకపోతే ఈపాటికి మన స్టాక్ మార్కెట్లు పూర్తిగా చతికిలపడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండేది. దేశీయ మదుపరులు ఈ నెలలో ఇప్పటి వరకు ఈక్విటీ నగదు విభాగంలో నికరంగా రూ.37,362 కోట్ల మేర షేర్లు కొనుగోలు చేశారు. అంటే ట్రేడింగ్ ఉన్న రోజుల్లో సగటున రోజుకు రూ.3,500 కోట్ల వరకు షేర్లు కొనుగోలు చేస్తున్నారన్నమాట. త్వరలో స్టాక్ మార్కెట్‌ పరిస్థితులు మారితే, మళ్లీ విదేశీ సంస్థాగత మదుపరులు ఈక్విటీ షేర్ల కొనుగోళ్లు మొదలుపెడితే.. అప్పుడు దేశీయ మదుపరులు తమ వద్ద ఉన్న షేర్లను అమ్మవచ్చు. అప్పటి వరకు వీరు పెట్టుబడులు పెడుతూ పోవాల్సిందే. అయితే రోజులు గడిచేకొద్దీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. స్టాక్ మార్కెట్ సూచీల పతనమూ తగ్గడం లేదు. రోజూ కొనుగోళ్లు జరుపుతుండడంతో దేశీయ మదుపరుల వద్ద నగదు నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. ఇలా ఎన్నాళ్లు? స్టాక్ మార్కెట్లు రోజూ పతనం అవుతుంటే వారు మాత్రం ఎంతకాలం షేర్లు కొనుగోలు చేస్తారు? ఇప్పుడు ఇదే స్టాక్ మార్కెట్ విశ్లేషకులను, మదుపుదారులను పీడిస్తోన్న పెద్ద ప్రశ్న!

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+