కరోనావైరస్ ఎఫెక్ట్: బ్యాంకాక్, సింగపూర్‌లకు ఆ ఎయిర్‌లైన్స్ సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: చైనాలో వెలుగు చూసిన అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వాణిజ్యం కుదేలైంది. ఇప్పటికే చాలా సంస్థలు నష్టాల బాట పడ్డాయి. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం నష్టాలను చవిచూస్తోంది. తాజాగా ప్రముఖ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ఎయిర్‌లైన్స్ 54 విమాన సర్వీసులను రద్దు చేసింది.
బ్యాంకాక్, సింగపూర్‌లకు వెళ్లే విమానాలను మార్చి నెలలో రద్దు చేస్తున్నట్లు ఆ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పటికే ఈ రూట్లలో ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియాతో పాటు మరో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో కూడా సర్వీసులను రద్దు చేశాయి.
ఇక ఈ విమాన సర్వీసులు రద్దు అయ్యాక... విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా మార్చి నెలలో తన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద బాంబు పేల్చింది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్లే 20 విమాన సర్వీసులు, ముంబై నుంచి సింగపూర్ వెళ్లే మరో26 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

ఢిల్లీ సింగపూర్‌ల మధ్య నడిచే 8 విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే బ్యాంకాక్ మరియు సింగపూర్ విమానాశ్రయ అధికారుల నుంచి ఎలాంటి అడ్వైజరీ జారీ కాలేదని, అదే సమయంలో ప్రయాణికులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండటం, ఆ రెండు దేశాలకు ప్రయాణికుల డిమాండ్ తక్కువ ఉండంటంతోనే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ఇక ఇప్పటికే విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయిలో డబ్బులు రీఫండ్ చేయడం జరుగుతుందని విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటన ద్వారా వివరించింది. అంతేకాదు మార్చి నెల కాకుండా మరో నెలలో ఈ ప్రదేశాలకు అదే డబ్బులతో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్, హాంగ్‌కాంగ్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, నేపాల్ నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications