కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికా మీద పంజా విసిరింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా కుదేలైంది. ప్రస్తుతం ఆర్థికమాంద్యం చేతుల్లో చిక్కి విలవిలలాడుతోంది అమెరికా. అమెరికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. ఇక ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ వర్తక, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పరిమితంగా మాత్రమే సేవలందించడానికి సడలింపు ఇచ్చిన నేపథ్యంలో రిటైల్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది.

అమెరికాలో సుమారు 25 వేల వరకు వాణిజ్య సముదాయాలు శాశ్వతంగా మూత
ఈ సంవత్సరం కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో అమెరికాలో సుమారు 25 వేల వరకు వాణిజ్య సముదాయాలు శాశ్వతంగా మూతపడనున్నాయి ఒక నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ దేశంలో ఉన్న మాల్స్,డిపార్ట్మెంటల్ స్టోర్ లపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక రిటైల్ అండ్ టెక్ డేటాసంస్థ కోర్ సైట్ నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం ప్రధానంగా మాల్స్ లో చాలా వరకు దుకాణాలు మూత పడడానికి సిద్ధంగా ఉన్నాయి.

దివాలాకు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్న నివేదిక
ఇక వస్త్ర వ్యాపారం,డిపార్ట్మెంటల్ స్టోర్ లు కూడా కుదేలు కానున్నాయని ఒక అంచనా. 2019లో 9800 పైగా దుకాణాలను మూసివేసిన రికార్డును ఇప్పుడు కరోనా కాలంలో బద్దలు కొట్టనున్నట్లుగా పేర్కొంది. కరోనా ప్రభావంతో 20 నుండి 25 వేల వరకూ ఈసారి వాణిజ్య సముదాయాలు మూతపడనున్నాయి అని, ప్రస్తుతం అవన్నీ దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే 15 మంది ప్రధాన రిటైలర్లు దివాలా పిటిషన్ వేశారని చెప్పారు.

ఈ వారంలోనే నాలుగు వేల దుకాణాలు మూసివేత నిర్ణయం
గతంలో ఎన్నడూ లేనివిధంగా అమెరికన్ రిటైలర్లు నష్టాలపాలయ్యారు అని నివేదిక పేర్కొంది. ఇక ఈ వారంలోనే నాలుగు వేల దుకాణాలను శాశ్వతంగా మూసివేయడానికి నిర్ణయించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా తెలియకముందే 15 వేల దాకా దుకాణాలు మూతపడ్డాయని అంచనా వేసిన నేపథ్యంలో ఇప్పుడు లాక్‌డౌన్ ప్రభావం విపరీతంగా ఉండటంతో 25 వేల దుకాణాలు మూతపడనున్నాయని తెలుస్తోంది.

అమెరికా చరిత్రలో ఊహించని ఉపద్రవం .. కుదేలైన ఆర్ధిక వ్యవస్థ .. దివాలా దిశగా వ్యాపారాలు
ఇక వందల సంఖ్యలో దుకాణాలను మూసివేసిన జాబితాలో విక్టోరియా సీక్రెట్, పెన్నీ, జెసి, పీర్ 1 ఇంపోర్ట్ సంస్థలున్నాయి. ఏదేమైనప్పటికీ అమెరికా చరిత్రలోనే ఊహించని ఆర్థిక మాంద్య పరిస్థితులు అమెరికాను కుదేలు చేస్తుంటే రిటైల్ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత ఆర్ధిక సంక్షోభంలో అమెరికా చిక్కుకునే ప్రమాదం లేకపోలేదు .


Click it and Unblock the Notifications