Corning: తెలంగాణకు అమెరికా సంస్థ కార్నింగ్ గట్టి షాక్.. రూటు మార్చిన ఆపిల్ సరఫరాదారు
Telangana: తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన భారత రాష్ట్ర సమితి(BRS)పై కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఓ భారీ కంపెనీ తెలంగాణను విడిచి పొరుగు రాష్ట్రానికి తరలిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంంది.
ఆపిల్ సరఫరాదారు 'కార్నింగ్' వెయ్యి కోట్ల పెట్టుబడితో గొరిల్లా గ్లాస్ సదుపాయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని గతంలో భావించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మాజీ IT మంత్రి KTR ఆ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై చర్యలు జరిపారు. ఫలితంగా అమెరికాకు చెందిన ఆ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడికి అంగీకరించింది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాన్ని కాదని తమిళనాడును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా తెలంగాణ నుంచి ఓ కంపెనీ రాష్ట్రాన్ని విడిచి బయటకు వెళ్లడం గత 9.5 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అని BRS నేత క్రిశాంక్ సోషల్ మీడయా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా ఈ పరిస్థితిని చక్కదిద్దుతుందని ఆశిస్తున్నట్లు X పోస్ట్‌లో తెలిపారు.
మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న కార్నింగ్.. దేశంలో తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని చూసింది. ఇందుకు సంబంధించి 931 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు KTR సెప్టెంబర్ 1న ట్వీట్ చేశారు. తద్వారా 800 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కాగా ఇప్పుడు అదికాస్తా తమిళనాడుకు తరలిపోతోంది.
పెట్టుబడిదారులతో ట్రస్ట్ సమస్యలు మొదలయ్యాయని, ఈ పరిణామం మంచిది కాదని పారిశ్రామికవేత్త, BRS లీడర్ అర్పిత ప్రకాశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి కంపెనీలు పారిపోతున్నాయన్నారు. వీటిని ఏవింధంగా అడ్డుకుంటారో చెప్పాలంటూ తన X పోస్ట్ లో CM రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేశారు.


Click it and Unblock the Notifications