కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా కీలక రంగాలు భారీగా నష్టపోయాయి. మార్చి నెలలో 8 కీలక రంగాల ఉత్పత్తి 6.5 శాతం క్షీణించింది. 2005 తర్వాత కీలక రంగాలు అత్యంత వరస్ట్ ప్రదర్శన చేశాయి. మార్చి నెలలో బొగ్గు మినహా ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం గణాంకాలు విడుదల చేసింది.

బొగ్గు మినహా కీలక రంగాలు ఢమాల్
గత ఏడాది మార్చిలో కీలక రంగాల ఉత్పత్తి 5.8 శాతంగా నమోదయింది. ఇప్పుడు 6.5 శాతం క్షీణతను నమోదు చేసింది. గత నెలలో ముడి చమురు ఉత్పత్తి 5.5 శాతం క్షీణించగా, సహజ వాయువు రంగం 15.2 శాతం, శుద్ధి ఉత్పత్తులు 0.5 శాతం క్షీణించాయి. ఎరువులు 11.9 శాతం, ఉక్కు 13 శాతం, సిమెంట్ 24.7 శాతం, విద్యుత్ 7.2 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి రేటు 4.1 శాతం నమోదయింది. గత ఏడాది ఇదే నెలలో ఈ ఉత్పత్తి వృద్ధి 9.1 శాతంగా నమోదయింది.

వరస్ట్ ప్రదర్శన.. కానీ ఊహించినంత భయంకరంగా లేదు
ఫిబ్రవరి నెలలో కీలక రంగాల ఉత్పత్తి 7.2 శాతం ఉండగా ఇప్పుడు 6.5 శాతానికి క్షీణించి 11 నెలల గరిష్టానికి చేరుకుంది. పూర్తి ఏడాది విషయానికి వస్తే మౌలిక సదుపాయాల పరిశ్రమలు గత ఏడాది 4.4 శాతం వృద్ధి సాధిస్తే ఇప్పుడు 0.6 శాతానికి పరిమితమైంది. మార్చిలో కీలక రంగాలు వరస్ట్ ప్రదర్శన చేశాయని, అయితే మనం ఊహించినంత భయంకరంగా మాత్రం లేనప్పటికీ వరస్ట్ ప్రదర్శనే అని ఇక్రా లిమిటెడ్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అన్నారు.

ఏప్రిల్ నెలలో మరింత భయంకరంగా..
మార్చి నెలలో వారం రోజులు లాక్ డౌన్ ఉంటేనే కీలక రంగాల వృద్ధి క్షీణించాయి. ఏప్రిల్ నెల పూర్తి లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాల ఉత్పత్తి నిలిచిపోయిందని దీంతో ఈ నెలలో క్షీణత భారీ స్థాయికి దిగజారిపోవచ్చునని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications