హైదరాబాద్ నగర వాసులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) కీలక అడుగులు వేస్తోంది. నగరానికి నిరంతరాయంగా, ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలూ నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిపాదించింది.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) వెంబడి రింగ్ మెయిన్ వాటర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే ఈ బృహత్ ప్రణాళికలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఈ ORR Water Grid Project కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) ఇప్పటికే సిద్ధమైందని.. త్వరలోనే పరిపాలనా, ఆర్థిక అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నగరంలో అమలులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థ ఎక్కువగా లీనియర్ పైప్‌లైన్లపై ఆధారపడి ఉంది. ఈ విధానంలో ప్రధాన పైప్‌లైన్‌లో ఎక్కడైనా లీకేజీ, మరమ్మతులు లేదా సాంకేతిక లోపాలు తలెత్తితే, ఆ లైన్‌పై ఆధారపడిన విస్తృత ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మూడు నుంచి నాలుగు రోజులకోసారి మాత్రమే నీటిని పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎల్బీ నగర్, తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పెరుగుతున్న జనాభా, వేగంగా విస్తరిస్తున్న నగర పరిధి దృష్ట్యా, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరమని జలమండలి భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రతిపాదించిన ORR వాటర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా కొత్త దశకు తీసుకెళ్లనుంది. ఈ ప్రాజెక్టు కింద ORR చుట్టూ సుమారు 140 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు, నగరంలోని అంతర్గత ప్రాంతాలకు నీటిని చేరవేసేందుకు మరో 98 కిలోమీటర్ల పొడవున రేడియల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా గోదావరి, కృష్ణా, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులను అనుసంధానిస్తారు. హైదరాబాద్‌కు నీటిని అందిస్తున్న ఐదు ప్రధాన వనరులను అనుసంధానిచండం ద్వారా నీటి సరఫరా నిరంతరం ఉంటుందని భావిస్తున్నారు.
ఈ అనుసంధాన వ్యవస్థ వల్ల నగరంలోని ఏ ప్రాంతం కూడా ఒకే నీటి వనరుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఒక వనరులో లేదా ఒక మార్గంలో నీటి సరఫరాకు అంతరాయం కలిగినా, తక్షణమే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నీటిని మళ్లించి సరఫరాను కొనసాగించవచ్చు. దీంతో నీటి సరఫరా వ్యవస్థ మరింత భద్రమై, నమ్మకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో, మంజీరా, ఉస్మాన్‌సాగర్ నీటి సరఫరా నెట్‌వర్క్‌లను ఆధునికీకరించేందుకు అదనంగా రూ.వేయి కోట్లతో ప్రత్యేక పనులు చేపడుతున్నారు. దీని ద్వారా పైప్‌లైన్ లీకేజీల వల్ల జరిగే నీటి నష్టాన్ని తగ్గించి, ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి.. పనులను వేగంగా పూర్తి చేయాలని జలమండలి యోచిస్తోంది. గోదావరి ఫేజ్-II ప్రాజెక్టు పూర్తయ్యే 2027 నాటికి ఈ ORR వాటర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే.. హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని జలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications