Uber charges: పట్టణాలు, నగరాల్లో మారుమూల ప్రాంతాలకు సైతం రైడ్ షేరింగ్ సంస్థలు తమ సేవలను అందిస్తున్నాయి. తద్వారా ఎక్కడికైనా చాలా తేలికగా ప్రయాణించే అవకాశం కల్పించాయి. అయితే కొన్నిసార్లు ఆయా సంస్థలు చేస్తున్న జిమ్మిక్కులు యూజర్స్‌కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. పట్టుమని 10 కిలోమీటర్లు కూడా లేని దూరానికి వేలకు వేలు ఛార్జ్ చేసి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి.
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబెర్ ఇండియాకు చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొత్తం 30 వేల జరిమానా విధించింది. మీడియా నివేదికల ప్రకారం.. అశ్వనీ ప్రశార్ అనే ప్రయాణికుడి నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు సదరు కంపెనీకి వ్యతిరేకంగా న్యాయస్థానం ఈ విధంగా తీర్పు ఇచ్చింది. కలిగిన అసౌకర్యానికి 20 వేలు, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో 10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 6, 2021 రాత్రి 10.40 నుంచి 10.57 వరకు కేవలం 15 మాత్రమే ఉబెర్ సేవలను వినియోగించుకున్నట్లు ప్రశార్ ఆరోపించాడు. 8.83 కి.మీ ప్రయాణానికిగాను ఉబెర్‌కు 1,334 చెల్లించినట్లు పేర్కొన్నాడు. ఘటనపై ఉబెర్ యాప్ మరియు జీమెయిల్ ద్వారా కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివిధ చాట్‌లు మరియు ఇమెయిల్‌లను సైతం కోర్టుకు సమర్పించాడు. కానీ ఆ వారి నుంచి సరైన సమాధానం రాలేదని వెల్లడించాడు.
అయితే ప్రశార్ ఫిర్యాదును ఉబెర్ ఇండియా వ్యతిరేకించింది. రైడర్‌కు చూపిన ముందస్తు ఛార్జీ రూ. 359 కాగా ప్రయాణ సమయంలో అనేక రూట్స్ డీవియేషన్‌ల వల్ల ఫైనల్ ధర రూ. 1,334 అని న్యాయస్థానానికి ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ఈ వ్యత్యాసానికి కారణం ఫిర్యాదుదారుడా లేదా డ్రైవరా అని గుర్తించలేకపోయినట్లు నివేదించింది.
వారిరువురి వల్ల జరిగే రూట్ డీవియేషన్‌కు తమ కంపెనీ బాధ్యత వహించదని ఉబెర్ తెలిపింది. అయిప్పటికీ వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకు రూ. 975 విలువైన ఉబెర్ క్రెడిట్‌లను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. బుకింగ్ వేళ చూపిన ఛార్జీల కంటే అదనపు మొత్తాన్ని వసూలు చేయడాన్ని అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా భావిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. డ్రైవర్, కంపెనీ మధ్య ఒప్పందాల ముసుగులో బాధ్యత నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. మొత్తం 30 వేల మేర జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.


Click it and Unblock the Notifications