Betting Apps: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి చెడు వ్యసనాలకు బానిసై ఎంతోమంది యువత ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారు. దేశంలోని చట్టాలు కూడా దీన్ని సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది.
ఇదే వ్యవహారంపై దేశంలోని సెలబ్రిటీలకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) ఓ విజ్ఞప్తి చేసింది. చట్ట విరుద్ధమైన, అనధికారిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తరహా జూదాల మార్కెటింగ్, ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని కోరింది. ఈ తరహా వ్యవహారాల్లో భాగం కావడం, ప్రోత్సహించడం, మద్దతుగా ప్రకటనల్లో నటించడం వంటివి చేయవద్దని సూచించింది.

'బెట్టింగ్ నిర్వహించే సంస్థలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు పలు టెక్నిక్స్ వినియోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వంటి పలువురు సెలబ్రిటీలను ప్రకటనల కోసం నియమించుకుంటున్నట్లు తెలిసింది. వారు కూడా వీటిని ప్రోత్సహిస్తుండటంతో ఈ తరహా కార్యకలాపాలు ఆమోదయోగ్యమైనవి అని ప్రజలు భావించే అవకాశం ఉంది' అని CCPA చీఫ్ కమిషనర్ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఎవరైనా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంగించినట్లు తెలిస్తే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సింగ్ హెచ్చరించారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించవద్దని ఇటీవల సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ను హెచ్చరించింది. ఆన్లైన్ ప్రకటనలు, మీడియేటర్స్ ద్వారా భారతీయ ప్రేక్షకులను టార్గెట్ చేస్తే తీవ్ర చర్యలు తప్పవని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications