Congress Party: హాట్ టాపిక్‌గా కాంగ్రెస్ నేత ప్రతిపాదన.. ఆ పన్ను విధిస్తే జరిగేది ఇదే..
Inheritance Tax: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత చేసిన ప్రతిపాదన యావత్ దేశాన్ని ఆలోచింప చేస్తోంది. పలువురు ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు తమదైన శైలిలో ఆ వ్యాఖ్యలకు అర్థం చెబుతున్నారు. అయితే అక్రమంగా, చట్టంలోని లొసుగులను ఉపయోగించి హద్దూ, అదుపూ లేకుండా సంపాదించిన బడాబాబులకు మాత్రం అవి రుచించడం లేదు.
అమెరికా తరహాలో వారసత్వపు పన్ను విధించడాన్ని భారత్ అనుసరించాలని కాంగ్రెస్ నాయకులు శామ్ పిట్రోడా ఇటీవల సూచించారు. ఇలా చేస్తే ఇక్కడి సూపర్ రిచ్ తమ వ్యాపారాలను ఇతర దేశాలకు తరలించే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ, ఆర్థికవేత్త మరియు రచయిత గౌతమ్ సేన్ అభిప్రాయపడ్డారు. పన్నుపోటు నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ వంటి దేశాలకు వలస వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.

అంబానీ, అదానీ, మహీంద్రా మరియు టాటాలు వంటి దాదాపు 500 మంది అత్యంత సంపన్నులు దేశం దాటితే భారత్‌కు గణనీయమైన నష్టం వాటిల్లుతుందని ఆయన వివరించారు. వారందరూ దుబాయ్ వంటి ఆదాయపు పన్ను లేని ప్రాంతాలకు వలస వెళ్లిపోవచ్చన్నారు. అక్కడ తిరిగి తమ బిజినెస్ మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ విషయంలో స్వీడన్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చని సేన్ తెలిపారు. వారసత్వ పన్ను విధించి ఒకానొక సమయంలో ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ కలెక్ట్ చేసినట్లు గుర్తు చేశారు. దీంతో చాలా మంది ధనికులు పారిపోతున్నందున తిరిగి ఆ పన్నును రద్దు చేసిందన్నారు. ఐకియా అధినేత కూడా అక్కడి నుంచి వలసవచ్చారని వివరించారు. తిరిగి ఎప్పుడైతే సంపద పన్ను రద్దు చేశారో అప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు చెప్పారు. భారత్ విషయంలోనూ అలాగే జరుగుతుందని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications