MP Dheeraj Sahu: త్వరలో దేశవ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తూ ఐటీ, ఈడీ వంటి అధికారులను పంపి సోదాలు చేయించటం సర్వసాధారణం అని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద రెయిడ్ చోటుచేసుకుంది.
ఇటీవల ఆదాయపు పన్ను అధికారులు కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కంపెనీలకు చెందిన ప్రాంగణాలతో పాటు మరికొన్ని చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.353 కోట్ల డబ్బుతో పాటు బంగారం, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ సొమ్మును లెక్కించేందుకు బ్యాంక్ ఉద్యోగులు 5 రోజులు శ్రమించారు. అయితే దీనిపై తొలిసారిగా కాంగ్రెస్ నేత నోరు విప్పారు. ఐటీ సోదాల్లో దొరికిన సొమ్ము తనకు చెందినదేనని వెల్లడించారు.

దాడులు జరిగిన సమయంలో తాను దిల్లీలో ఉన్నానని.. సిగ్గు కారణంగా మీడియా ముందుకు దీనిపై స్పందించేందుకు రాలేదని పేర్కొన్నారు. తాను మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నానని.. తనకు ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఇది తనను బాధించిందని, తన గురించి ఎప్పుడూ వివాదాలు రాకూడదని కోరుకున్నానని అన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభించటం నుంచి పేదలకు తన తండ్రి కాలం నుంచి అనేక సహాయ కార్యక్రమాలు చేశామని తెలిపారు.
ఐటీ అధికారులు రికవరీ చేసిన డబ్బు తన సంస్థ డబ్బని నేను ఖచ్చితంగా చెప్పగలని ఎంపీ వెల్లడించారు. దాదాపు వందేళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్నామని.. ప్రభుత్వానికి చాలా ఆదాయాన్ని ఇచ్చామని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నానని.. కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని చూసుకుంటున్నారని ధీరజ్ సాహు పేర్కొన్నారు. తనది చాలా పెద్ద కుటుంబమని, వ్యాపారంలో ఆరుగురు సోదరుల పిల్లలు ఉన్నారని అన్నారు. మద్యం వ్యాపారంలో విక్రయాలు ఎక్కువగా నగదు రూపంలో జరుగుతాయని అది పూర్తిగా వ్యాపారానికి సంబంధించిన మెుత్తమని పార్టీలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
ఇటీవల పన్ను అధికారులు మూడు రాష్ట్రాల్లో ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంగణాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగదు నింపిన 176 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని లెక్కించగా.. ఎంపీ దాచిన స్థలాల నుంచి రూ.353 కోట్లు సేకరించబడినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు ఒక్క ఆపరేషన్‌లో ఇంత డబ్బు పట్టుబడలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications