న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం.. ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేవు అని తేల్చి పడేశారు. ఉన్న ఒకట్రెండు పార్టీలు కూడా నోరు మెదపట్లేదని స్పష్టం చేశారు. తన సొంత పార్టీ కాంగ్రెస్‌ను కూడా మినహాయించినట్లు కనిపించలేదాయన. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులపైనా నిప్పులు చెరిగారు. ఆయన ఆగ్రహానికి ప్రధాన కారణం- ఆర్థిక సర్వే 2022.
కేంద్ర ప్రభుత్వం సోమవారమే ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. లోక్‌సభలో దీన్ని టేబుల్ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. వ్యవసాయ రంగం వాటా అధికంగా ఉంటుందని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. మిగిలిన రంగాల ప్రాధాన్యతలో పెద్దగా మార్పులు ఉండబోవనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.

ఈ ఆర్థిక సర్వేపై ప్రతిపక్ష పార్టీలేవీ స్పందించకపోవడం.. పీ చిదంబరాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్టయింది. అందుకే- ఆయన తన ట్విట్టర్‌కు పని చెప్పారు. ఇవ్వాళ తెల్లవారు జామున తాను దినపత్రికల్నీ చూశానని, ఎకనమిక్ సర్వే మీద ప్రతిపక్ష పార్టీలు స్పందించినట్లుగా ఎక్కడే గానీ తనకు వార్తలు కనిపించలేదని అన్నారు. దీన్ని బట్టి చూస్తోంటే దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయిందనేది స్పష్టమౌతోందని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌లో ఛార్లెస్ డికెన్స్ రాసిన ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ నవలను ఉటంకించారు. అత్యద్భుత సందర్భాలు, అత్యంత దారుణ పరిస్థితులను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలను సంధించారు. 2020 మార్చి 31వ తేదీ నాటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎకనమిక్ సర్వే చూసిన ప్రతీసారీ తనకు వికారం కలుగుతోందని వ్యాఖ్యానించారు. 2020 మార్చి 31వ తేదీన ఏ వృద్ధిరేటును టార్గెట్ చేశామో.. రెండు సంవత్సరాల తరువాత కూడా అదే వృద్ధి రేటును అందుకోవడానికి కష్టపడాల్సి వస్తోందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications