Ambani-Adani: పార్లమెంటులో ఉగ్ర సింహంలా రాహుల్ గాంధీ.. టార్గెట్ అంబానీ, అదానీ!
Rahul Gandhi: మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఏ ఒక్క విషయంలోనూ ఎన్డీఏ సర్కారును ఉపేక్షించటం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రం చేస్తున్న పనులను ఏకిపారేస్తున్నారు.
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో భారతదేశపు సంపన్న వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరినీ ఏ1, ఏ2 అంటూ సంబోధించారు. వాస్తవానికి ఈ పదాలను చట్ట ప్రకారం నేరస్తులను సూచించటానికి వినియోగిస్తారు. ఈ క్రమంలోనే రాహుల్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులపై సైతం కామెంట్స్ చేశారు. దేశంలో రైతులు సైతం ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అయితే రాహుల్ ఘాటు ప్రసంగం తర్వాత అధికార పార్టీ కూడా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.

దీనికి తోడు బీజేపీపై విరుచుకుపడుతూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పై కూడా విరుచుకుపడ్డారు. అంబానీ, అదానీలు దేశంలోని మెుత్తం సంపదపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నారని వీరే దేశాన్ని నియంత్రిస్తున్నారని అన్నారు. అంబానీ, అదానీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు స్పీకర్ ఓం బిర్లా రాహుల్‌ను మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంటులో సదరు వ్యాపారవేత్తల పేరును ప్రస్థావించకుండా నిరోధించటాన్ని తప్పుపడుతూ ఇకపై వారిని ఏ1, ఏ2 అని పిలుస్తానని రాహుల్ తేల్చి చెప్పారు. పార్లమెంటులో లేనివారి గురించి ప్రస్థావించవద్దని రాహుల్ గాంధీకి చెప్పటంపై కొందరు నెటిజన్లు సైతం స్పందించారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకునేందుకు లేచి నిలబడ్డప్పుడు ఆయనను దూషించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు A1, A2 లను రక్షిస్తున్నారని రాహుల్ అన్నారు. వీరి చేతిలోనే దేశంలోని ఇన్‌ఫ్రా స్టర్చర్, టెలికాం, ఎయిర్ పోర్ట్స్, ఓడరేవులు ఉన్నాయని ప్రస్తుతం వారు భారతీయ రైల్వేలోకి సైతం తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications