Byju's News: జీతాల కోసం ఇల్లు తాకట్టు.. త్వరలో ఆస్తుల అమ్మకం..!!
Byju Raveendran: దేశంలో అతిపెద్ద ఎడ్‌టెక్ స్టార్టప్ అయిన బైజూస్ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులకు సైతం డబ్బులు కొరవడినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంథ్రన్ ఉద్యోగుల జీతాలకు అవసరమైన మెుత్తాన్ని సమకూర్చుకునేందుకు ఏకంగా తన ఇంటిని తాకట్టుపెట్టినట్లు వెల్లడైంది. తన పేరుమీద ఉన్న ఇంటితో పాటు కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఇతర ఆస్తులను సైతం తాకట్టుకి వినియోగించినట్లు వెల్లడైంది. 12 మిలియన్ డాలర్లను అప్పుగా పొందేందుకు బెంగళూరులోని రెండు ఇళ్లతో పాటు నిర్మాణంలో ఉన్న మరో విల్లాను దీనికోసం తాకట్టుపెట్టారని వినికిడి.

గత వారాంతంలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు అందనిమాట నిజమే. మిగిలిన వారికి సోమవారం తాకట్టు ద్వారా వచ్చిన డబ్బుతో చెల్లింపులు పూర్తి చేసినట్లు సమాచారం. కంపెనీ మునిగిపోకుండా ఉండేలా చూసేందుకు వ్యవస్థాపకుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో స్టార్టప్ తన అమెరికా ఆధారిత పిల్లల డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను సుమారు 400 మిలియన్ డాలర్లకు విక్రయించే ప్రక్రియలో ఉంది.
ఇదే క్రమంలో బైజూస్ FY22 ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిపోర్టులను ఆమోదించేందుకు యాన్యువల్ జనరల్ మీటింగ్ కోసం తాజాగా పిలుపునిచ్చింది. ఫైనాన్షియల్‌లను ఆమోదించడం సహా పలు విషయాలను సమావేశంలో చర్చించాలని కంపెనీ యోచిస్తోంది. గతంలో బైజూ మేనేజ్‌మెంట్ తన పెట్టుబడిదారులతో కంపెనీ సెప్టెంబరు చివరి నాటికి FY22 ఫలితాలను, డిసెంబర్ చివరి నాటికి FY23 ఫలితాలను విడుదల చేస్తుందని అంగీకరించింది. ఈ క్రమంలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రస్తుత తరుణంలో కంపెనీ లిక్విడిటీ కోసం అవసరమైన నిధులను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్విడిటీ పరిస్థితి ప్రమాదకరంగా మారినవేళ ఆస్తుల విక్రయంపై సీనియర్ మేనేజ్‌మెంట్‌ను కలవడానికి బైజు రవీంద్రన్ చర్చించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలు, సప్లయర్స్, టాక్స్ డిపార్ట్మెంట్, BCCIని చెల్లించడానికి బైజూకి మార్చి నాటికి 500-600 కోట్ల నగదు అవసరమని సమాచారం. ఇదే సమయంలో కంపెనీ తన మార్కెట్ విలువను సైతం భారీగా కోల్పోతోంది.


Click it and Unblock the Notifications