Air India: భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియాను దాని పూర్వపు యజమాని టాటాలు తిరిగి కొనుగోలు చేశారు. తాము నడపంలేమంటూ కేంద్రం చేతులెత్తేస్తే తమ మహారాజాను తిరిగి దక్కించుకున్నారు రతన్ టాటా.
అయితే వివిధ కంపెనీల కింద ఉన్న విమానయాన వ్యాపారాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. దీని ద్వారా నిర్వహణ సులభతరం కావటంతో పాటు, ఖర్చులు కూడా తగ్గుతాయని భావించింది. అందుకే ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఏషియాలను కలపాలని చూస్తోంది. అయితే దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) నుంచి వచ్చిన నోటీసులు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి.

టాటా గ్రూప్ గత ఏడాది నవంబర్‌లో ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనాన్ని ప్రకటించగా.. దీనికోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో CCI నుంచి అనుమతిని కోరింది. కానీ ఇప్పుడు టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా, విస్తారా విలీన ప్రతిపాదనను సమీక్షించాలని సీసీఐ నిర్ణయించింది. దీంతో టాటాల ప్లాన్ రోడ్‌బ్లాక్‌ను తాకింది. టాటాల అభ్యర్థనకు సీసీఐ వేగవంతమైన అనుమతిని ఇవ్వలేదు. బదులుగా రెండు విమానయాన సంస్థలకు నోటీసు పంపింది. విలీనం ప్రభావంపై విచారణ ఎందుకు నిర్వహించకూడదని అందులో ప్రశ్నించింది.
ప్రస్తుతం ప్రక్రియ రెండవ దశకు చేరుకుందని ఇది పార్టీలు, CCI మధ్య మరింత చర్చకు దారి తీస్తుందని యాంటీట్రస్ట్ బాడీ అధికారి తెలిపారు. తాజా విలీనం జరిగితే ఎయిర్ ఇండియా దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్ గా మారుతుంది. ఇక ఇండిగో తర్వాతి స్థానంలో నిలుస్తూ రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా మారనుంది. గగనతలంలో రెండు కంపెనీల ఆధిపత్యం కారణంగా టిక్కెట్ల ధరలు పెరుగుదలకు దారితీయవచ్చు.
ఇప్పటికే సరసమైన ఛార్జీలు, విమానయాన సంస్థల ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యతను సాధించటంలో విమానయాన మంత్రిత్వ శాఖ సవాలును ఎదుర్కుంటోంది. అయితే ఆకాశ వంటి చిన్న పోటీదారులు దీనిని అధిగమించటం ఖర్చుతో కూడుకున్నందున సాధించలేవు. ఇండిగో-ఎయిర్ ఇండియా డ్యూపోలీ ఎయిర్‌లైన్ రంగంలో మరిన్ని వైఫల్యాలను నివారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications