New Labour Laws: అమలు కోసం వేచి ఉన్న 4 కొత్త కార్మిక చట్టాలు బహుళ రంగాల్లో పెను మార్పులను తీసుకురానున్నాయి. ఇందులో ఉద్యోగులకు అనుకూలంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి.
కొత్త లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగులు క్యాలెండర్ సంవత్సరంలో 30 రోజుల కంటే ఎక్కువ పెయిడ్ సెలవులను పోగుచేయలేరు. పెయిడ్ హాలిడేస్ 30 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కంపెనీ లేదా యాజమాన్యం ఉద్యోగులకు వాటి సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్'.. 4 కార్మిక చట్టాలలో ఒకటి.. దీని ప్రకారం 'ఉద్యోగి' అంటే మేనేజీరియల్, సూపర్వైజరీ స్థాయిలో లేనివారు.

ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్; వేతనాలపై కోడ్; పారిశ్రామిక సంబంధాల కోడ్; సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేవి నాలుగు కొత్త కార్మిక చట్టాలు. వీటికి పార్లమెంట్ ఇప్పటికే ఆమోదముద్ర వేయటంతో ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే వీటిని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చే తేదీని ఇంకా ప్రకటించలేదు.
ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020 (OSH కోడ్)లోని సెక్షన్ 32, వార్షిక సెలవు, క్యారీ ఫార్వర్డ్, ఎన్‌క్యాష్‌మెంట్‌కు సంబంధించి అనేక షరతులను కలిగి ఉంది. సెక్షన్ 32(vii) కింద ఒక కార్మికుడు గరిష్టంగా 30 రోజుల వరకు పెయిడ్ సెలవులను తర్వాతి క్యాలెండర్ ఏడాదికి క్యారీ ఫార్వాడ్ చేసుకోవచ్చు. క్యాలెండర్ సంవత్సరం చివరిలో వార్షిక సెలవు బ్యాలెన్స్ 30 దాటితే.. ఆ ఉద్యోగి అదనపు సెలవును ఎన్‌క్యాష్ చేసి.. మిగిలిన 30 రోజులను వచ్చే ఏడాదికి ఫార్వార్డ్ చేసుకునేందుకు అర్హులని స్పష్టంగా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలోని అనేక కంపెనీలు ప్రస్తుతం తమ ఉద్యోగులను వార్షిక ప్రాతిపదికన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను అనుమతించడం లేదు. అలాగే పెయిడ్ లీవ్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ పరిమితిని మించడాన్ని పాటించటం లేదు. మరికొన్ని సంస్థలైతే బలవంతంగా ఉద్యోగులను పెయిడ్ లీవ్స్ ముందుగా వాడుకోవాలని లేదంటే వారు నిర్ణయించిన తేదీ నాటికి అవి నిరుపయోగంగా మారిపోతాయని బలవంతంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాస్తున్నాయి. కొన్ని కంపెనీలు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలను అడ్డుకునేందుకు కొత్త చట్టం తోడ్పడనుంది.


Click it and Unblock the Notifications