Rice: బియ్యం కిలో రూ.90, ఉల్లి కిలో రూ.80 పైనే.. ఇక బతకడం కష్టమే..!
సామాన్యులు బతకడం రోజు రోజుకు కష్టంగా మారుతుంది. అన్నింటి ధరలు భారీగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎల్ నినో వల్ల పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో బియ్యం ధరలు మండిపోతున్నాయి. మార్కెట్లో సన్న రకం బియ్యం రిటైల్ ధర కిలో రూ.85 నుంచి రూ.90 వరకు చేరుకున్నాయి. గత 30 నుంచి 45 రోజుల్లోనే 25 కిలోల బస్తాపై రూ.300 నుంచి రూ.500 వరకు బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. గత నెలలో రూ.1,800 ఉన్న బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.2వేలు దాటిందని ఓ వినియోగదారుడు చెప్పాడు.
గతంలో రూ.1,500 ఉన్న 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు రూ.1,900కి చేరిందని వాపోతున్నారు. స్టీమ్ రైస్ బస్తా రూ.1,600 నుంచి రూ.2,200 వరకు పెరిగింది. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో బ్రాండ్లు, ప్యాక్ సైజ్ ఆధారంగా ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నప్పటికీ.. సామాన్యులకు ఇది మోయరాని భారంగా మారుతోందని చెబుతున్నారు. అయితే బియ్యం ధరలే కాదు.. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అటు ఉప్పులు, పప్పులు ధరలు కూడా భారీగానే ఉన్నాయి. పల్లిలు ధరలు కూడా భారీగానే ఉన్నాయి. కిలో రూ.180 నుంచి రూ.190 పలుకుతున్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తత నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా నష్టాలను భరిస్తున్నారు. అయితే త్వరలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఈ భారం అన్నింటిపై పడుతుంది. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరుగుతాయి. ఎల్పీజీ ధరలు పెరిగితే టిఫిన్ సెంటర్లలో టిఫిన్ల ధరలు పెరుగుతాయి. దీంతో సామాన్యుడు బతకడం కష్టంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 3 నుంచి 10 నెలలు ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల్లో నీరు శరవేగంగా తగ్గుతోంది. దీంతో యాసంగిలో వరి పంట వేయవద్దని ప్రభుత్వం కోరుతుంది. ఈసారి వరి పంట భారీగా తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా బియ్యం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం ధరలు కూడా ఇలాగే పెరిగితే పేద, మధ్యతరగతి ప్రజల ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications