LPG price hike: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర, రూ.250 జంప్
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 1 శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. అలాగే, ప్రతి నెల మొదటి తారీఖున సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరించాయి. నేడు 14 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేనప్పటికీ, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఈ సిలిండర్ ధరపై రూ.250 భారీగా పెంపు నమోదయింది.
తాజా పెంపు అనంతరం దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,253కు పెరిగింది. కోల్‌కతాలో రూ.2,351, ముంబైలో రూ.2,205, చెన్నైలో రూ.2,406కు చేరుకుంది. గత రెండు నెలల కాలంలో 19 కిలోల సిలిండర్ ధర రూ.346 పెరిగింది. గత మార్చి 1వ తేదీన ఈ సిలిండర్ ధర రూ.105 పెరగగా, మార్చి 22న రూ.9 తగ్గించారు. ఇప్పుడు మళ్లీ రూ.250 పెరిగింది.

దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు నెలల తర్వాత పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 4వ తేదీకి ముందు కేంద్రం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ట్యాక్స్ తగ్గించింది. ఆ తర్వాత 137 రోజుల పాటు ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీ పెరుగుదల నమోదయినప్పటికీ, ఇక్కడ ఎన్నికల కారణంగా ధరల్లో మార్పులేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పది పన్నెండు రోజులు స్థిరంగానే ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం స్వల్పంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఇది తక్కువే. దీంతో చమురు మార్కెటింగ్ కంపెనీలకు నష్టాలను కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications