LPG Price Hike: చాలా రోజులుగా దేశంలోని అనేక వర్గాలకు చెందిన వ్యక్తులు నిర్మలమ్మ నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని నెల మెుదటి రోజు కావటంతో దేశంలోని చమురు కంపెనీలు తమ గ్యాస్ సిలిండర్ ధరల రేట్లలో మార్పులు చేశాయి.
చమురు కంపెనీలు ఎప్పటి మాదిరిగానే తమ గ్యాస్ ధరలను నెల మెుదటి రోజున అప్‌డేట్ చేశాయి. దీంతో ద్రవ్యోల్బణం షాక్ కారణంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లు ఖరీదైనవిగా మారాయి. ఒక్కో సిలిండరు ధర స్వల్పంగా రూ.14 చొప్పున పెంచుతున్నట్లు గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. వాస్తవానికి బడ్జెట్ ప్రసంగంతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తుందని చాలా మంది భావించారు. కానీ అలా జరగలేదు.

తాజా పెంపు తర్వాత దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ రేట్లను పరిశీలిస్తే దిల్లీలో రూ.1,769.50, కోల్‌కతాలో రూ.1,887, ముంబైలో రూ.1,723, చెన్నైలో రూ.1,937గా ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో గృహ వినియోగదారులు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉన్నాయి.
గడచిన 3 ఏళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల ధరలు 17 సార్లు మార్పులకు గురికాగా.. వాణిజ్య సిలిండర్ల రేట్లు మాత్రం దాదాపుగా ప్రతినెల మారుతూనే ఉన్నాయి. వీటి ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా తగ్గినప్పుడు మాత్రం చాలా తక్కువగా అనేక సార్లు నమోదయ్యాయి. ద్రవ్యోల్బణ సమయంలో ధరలు ఇలా పెరగటం ప్రజలను ఆందోళనలకు గురిచేశాయి. ఇండియన్ ఆయిల్ డేటా ప్రకారం జనవరి 1, 2021న దిల్లీలో 19 కిలోల LPG సిలిండర్ ధర రూ.1,349గా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్లు 50 సార్లు మారాయి.


Click it and Unblock the Notifications