LPG Price Hike: డిసెంబరులో మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు.. కొత్త రేట్లు ఇప్పుడు తెలుసుకోండి..
LPG Cylinder Rate: ప్రతి నెల దేశంలోని చమురు కంపెనీలు తమ గ్యాస్ సిలిండర్ విక్రయ ధరలను పరిశీలిస్తుంటాయి. దీనికి అనుగుణంగా డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచటం లేదా తగ్గించటం చేస్తుంటాయి. ఈ క్రమంలోనే కంపెనీలు డిసెంబర్ నెలకు సంబంధించిన రేట్ల సవరింపును ప్రకటించాయి.
దీంతో డిసెంబర్ 1, 2024 నుంచి మార్పులు చేసిన ధరలు అమలులోకి వచ్చాయి. ఆదివారం నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో కమర్షియల్ వినియోగదారులు ఉపయోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.16.50 పెంచబడ్డాయి. దీనికి ముందు నవంబర్ నెలలో సైతం కంపెనీలు ఈ సిలిండర్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కంపెనీలు జెట్ ఇంధన ధరలను సైతం పెంచాయని వెల్లడైంది. దీంతో వరుసగా 5వ నెల కూడా చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం సమయంలో ఇప్పటికే అన్నింటి ధరలు పెరిగిన వేళ గ్యాస్ ధరలు కూడా పెరగటంతో వ్యాపారం ప్రభావితం అవుతుందని భావిస్తున్నారు.

ఆగస్టు నెల నుంచి నిరంతరాయంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కంపెనీలు తమ కమర్షియల్ సిలిండర్ల రేట్లను రూ.16.50 చొప్పున పెంచాయి. దీంతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో తాజా ధరలను పరిశీలిస్తే దిల్లీలో రూ.1818.50, కలకత్తాలో రూ.1927, ముంబైలో రూ.1771, చెన్నైలో రూ.1980.50గా నేటి నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇదే క్రమంలో విమానాలు నడపటానికి వినియోగించే జెట్ ఇంధన ధర నేటి నుంచి కిలో లీటరుకు రూ.1318.12 పెరుగుదలను నమోదు చేసింది.
గడచిన 5 నెలలుగా కమర్షియల్ సిలిండర్ల ధర ఒక్కోదానిపై రూ.173 పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో సాధారణ ప్రజలు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం చమురు కంపెనీలు ఎలాంటి మార్పులూ లేకుండా స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో 14.2 కేజీల సిలిండర్ల ధరలు ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే.. దిల్లీలో రూ.803, కలకత్తాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications