కరోనా మహమ్మారి అంశంపై చైనాపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. దీంతో చైనాతో వాణిజ్యం విషయంలో నిబంధనల్ని కఠినతరం చేసేందుకు సిద్ధమైంది అగ్రరాజ్యం. తాజాగా సైనిక ఉత్పత్తులు, టెక్నాలజీకి సంబంధించిన ఎగుమతుల విషయంలోని నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. పౌర వినియోగం కోసం వాటిని కొనుగోలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని తెలిపింది.

చైనాతో సహా ఈ దేశాలకు కఠినతరం
చైనాతో పాటు రష్యా, వెనిజులాకు కూడా ఇదే తరహా కఠినతర నిబంధలను అమలు చేయాలని నిర్ణయించింది అమెరికా. అయితే చైనాతో మినహాయించి మిగతా రెండు దేశాలతో పరిమితస్థాయిలో వాణిజ్యం కొనసాగుతోంది. కాబట్టి పెద్దగా ప్రభావం చూపదు. చైనాపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని దేశాలకు అమెరికా కంపెనీలు ఎగుమతి చేసే ఉత్పత్తులు పక్కదారి పడుతున్నాయని ఈ మూడు దేశాలను ఉద్దేశించి అమెరికా వాణిజ్య కార్యదర్శి ఆరోపించారు.

అమెరికా సాంకేతికత తప్పుడు చేతుల్లోకి వెళ్లవద్దు
అమెరికా ఎగుమతి నియంత్రణ నిబంధనల్లోని పరిమితులను ఆసరా చేసుకొని కొన్ని దేశాలు తమ దేశం ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని అగ్రరాజ్యం విమర్శలు గుప్పిస్తోంది. అందుకే అమెరికా సాంకేతికత తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చిందని తెలిపింది.

అన్నింటికి అనుమతి తప్పనిసరి
ఈ మార్పుల్లో భాగంగా వినియోగించడానికి సిద్ధంగా ఉన్న సైనిక ఉత్పత్తుల ఉపయోగంపై నియంత్రణలను మరింత విస్తృత పరిచారు. పౌర వినియోగానికి వాడే ఉత్పత్తుల ఎగుమతిపై ఉన్న అనుమతి మినహాయింపులు రద్దు చేశారు. ఇక నుంచి ఎగుమతి చేసే వస్తువులకు అనుమతి తప్పనిసరి చేశారు. ఇది చైనా, రష్యా, వెనిజులాకు వర్తిస్తుంది. మిలిటరీలో వాడే సెమీ కండక్టర్లు, సెన్సార్లు సహా ఇతర టెక్నాలజీకి కూడా అనుమతులు తప్పనిసరి చేసింది.

చైనాపై ట్రంప్ ఆగ్రహం
కరోనా అంశంపై చైనా తీరు పట్ల ఏమాత్రం సంతృప్తికరంగా లేమని ట్రంప్ పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కరోనాకు ముందు ఇరుదేశాల మధ్య కుదిరిన తొలి వాణిజ్య ఒప్పందాన్ని బీజింగ్ అమలు చేయాల్సిందేనని కూడా చెబుతున్నారు. అలా కుదరదంటే ఒప్పందాలు రద్దు చేసుకుంటామని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications