Pakistan: పాకిస్థాన్ ను భయపెడుతున్న రుణభారం.. రానున్న మూడేళ్లు మేనేజ్ చేయడం కష్టమే.. ఎందుకంటే..
Pakistan: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశం పాకిస్థాన్ ను మరో రుణభారం భయపెడుతోంది. చైనా, సౌదీ అరేబియాలకు 77 బిలియన్ డాలర్లను 2026 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు వాషింగ్టన్ కు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ (USIP) నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2026లోపు ఈ మొత్తాన్ని పే చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఒకవేళ డీఫాల్ట్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
ప్రస్తుతం పాకిస్థాన్ 35.37 శాతం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. 5 దశాబ్దాలలో ఇదే అత్యధికం. గోధుమ పిండి, పంచదార, వంటనూనె వంటి నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు దేశంలో రాజకీయ విభేదాలు, పెరుగుతున్న ఉగ్రవాదం మరోపక్క వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ బాహ్య రుణ భారం కారణంగా డీఫాల్ట్ అయ్యే ప్రమాదమూ ఉందని నివేదిక అంచనా వేసింది.

USIP నివేదిక ప్రకారం.. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన చైనా, రాబోయే మూడేళ్లలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఆ దేశ బాహ్య రుణ భారం 4.5 బిలియన్ డాలర్లు ఉంది. దీనికి తోడు చైనీస్ సేఫ్ డిపాజిట్ కి 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మరో 1.4 బిలియన్ డాలర్ల అప్పులు సైతం మెచ్యూరిటీ స్టేజ్ కి చేరుకోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
ఇంతకు ముందు చేసిన విధంగానే, తమ రుణాలను రీఫైనాన్స్ చేయడమే కాకుండా రోల్ ఓవర్ చేయాలని చైనాను పాకిస్థాన్ కోరడం మంచిదని నివేదిక సూచించింది. అలా చేస్తే ఇప్పటికి గట్టెక్కినా, తదుపరి ఏడాదికి అప్పుల భారం దాదాపు 25 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని వెల్లడించింది. డిసెంబరు 2022 నాటికి మొత్తం రుణాలు 126.3 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులో కనీసం 77 శాతం అంటే 97.5 బిలియన్లు పాకిస్థాన్ ప్రభుత్వం నేరుగా రుణపడి ఉంది.

స్వల్పకాలిక రుణ చెల్లింపులను గమనిస్తే.. చైనా సేఫ్ డిపాజిట్ల కోసం 4 బిలియన్ డాలర్లు, సౌదీ డిపాజిట్లకు 3 బిలియన్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) డిపాజిట్లకు 2 బిలియన్లు ఉన్నాయి. ఇవికాక చైనా బ్యాంకులకు మరో 1.1 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక వాణిజ్య రుణాలను పాక్ తిరిగి చెల్లించాల్సి ఉందని USIP పేర్కొంది. మరోపక్క 2019లో IMF ఆమోదించిన 6.5 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని పొందడానికి సైతం ఆ దేశం పోరాడుతూనే ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications