నేను విశాఖలోనే పెరిగాను.. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ కీలక వ్యాఖ్యలు.. కొత్త క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ
విశాఖపట్నం రావడం తన సొంతింటికి వచ్చిన భావన కలిగిస్తోందని కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈఓ రవి కుమార్ సింగిసెట్టి అన్నారు. తన కుటుంబ మూలాలు విశాఖపట్నానికి చెందినవేనని తెలిపారు. తమ పూర్వీకులు విశాఖ ప్రాంతంలోనే నివసించారని.. వ్యక్తిగతంగా తన బాల్యం, యువకుల దశలో శ్రీకాకుళం-విశాఖపట్నం మధ్య తరచూ ప్రయాణాలు చేసిన అనుభవాలు ఉన్నాయని రవికుమార్ గుర్తుచేశారు.ఈ ప్రాంతాలతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని ఆయన తెలిపారు.
ప్రపంచ స్థాయి ఐటీ సంస్థకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ, తన మూలాలను మరచిపోలేదని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతం తన వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషించిందని ఆయన సూచించారు. భవిష్యత్తులో విశాఖపట్నం దేశంలోని కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా అవతరించబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ కేంద్రం ద్వారా మొత్తం 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 8 వేల ఉద్యోగాల కల్పనకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. అదేవిధంగా, విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC)ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇది నగర ఐటీ రంగానికి మరింత బలం చేకూర్చనుందని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌తో పాటు సత్వా సంస్థ, మరో ఏడు ఐటీ సంస్థల కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కాగ్నిజెంట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విశాఖ నగరం టెక్నాలజీ, నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మరింత వేగంగా ఎదుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎకనమిక్ రీజియన్ కాన్సెప్ట్ కింద నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాగ్నిజెంట్‌కు భారత్‌లో ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, పుణె, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కేంద్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని అన్నారు.
కాగ్నిజెంట్ సంస్థ హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్ అండ్ రిసోర్సెస్ వంటి కీలక రంగాల్లో సేవలందిస్తోందని రవికుమార్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, అందులో 80 శాతం మంది భారతీయులేనని చెప్పారు. సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావడం భారత టాలెంట్ శక్తిని చాటిచెబుతుందని వ్యాఖ్యానించారు.
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజాల పెట్టుబడులతో విశాఖలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ఐటీ పెట్టుబడులతో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.రాయితీ ప్యాకేజీలపై ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం అదృష్టమని లోకేశ్ అన్నారు.


Click it and Unblock the Notifications