న్యూఢిల్లీ: ఒక్కరోజు వ్యవధిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరలు పెరిగాయి. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ మొత్తానికీ సీఎన్జీ, పీఎన్జీని సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ తన ధరలను సవరించింది. శుక్రవారం సీఎన్జీ ధరను పెంచిన ఈ కంపెనీ.. తాజాగా పీఎన్జీ రేటును కూడా పెంచింది. గ్యాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్- సహజవాయు ధరలను పెంచడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఇంద్రప్రస్థ లిమిటెడ్ తెలిపింది.
ప్రతి నెలా 60 నుంచి 70 శాతం వరకు నేచురల్ గ్యాస్ రేట్లను పెంచుకోవడానికి గెయిల్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కిందటి నెల ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఈ నెల 1వ తేదీ నాడే గెయిల్- సహజవాయు ధరలను సవరించింది. 62 శాతం మేర వాటి ధరలను పెంచింది. దీన్ని అనుసరిస్తూ తాము సీఎన్జీ పీఎన్జీ రేట్లను పెంచాల్సి వచ్చిందని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ తెలిపింది.

తాజాగా అమల్లోకి వచ్చిన సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర కేజీ ఒక్కింటికి రూ.2.28 పైసలు, పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ ధరను రూ.2.10 పైసల మేర పెంచింది ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్జీ ధర రూ.28 పైసలుగా నమోదు కాగా.. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లల్లో దీని రేటు రూ.2.55 పైసలకు చేరింది.
ఈ పెరుగుదలతో సీఎన్జీ కేజీ ఒక్కింటికి ఢిల్లీలో రూ.47.48 పైసలు, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లల్లో రూ.53.45 పైసలకు చేరింది. పెరిగిన ధరలు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. గుర్‌గావ్-రూ.55.81, రెవారీ-రూ.56.50, కర్నాల్, కైతాల్-రూ.54.70, ముజప్ఫర్‌నగర్, షామ్లీ-రూ.60.70, కాన్పూర్, ఫతేపూర్, హమీర్‌పూర్-రూ.63.97, అజ్మీర్ రూ.62.41 పైసలుగా రికార్డయింది.
పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే వంటగ్యాస్ ధర రూ.2.10 పైసల మేర పెరిగింది. దీనితో స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పీఎన్జీ ధర రూ.33.01 పైసలుగా నమోదైంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లల్లో దీని ధర రూ.32.86 పైసలకు చేరింది. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి పీఎన్జీ వంటగ్యాస్ ధర పెరిగింది. కాగా- వంటగ్యాస్ సిలిండర్ల మీద కూడా అదనపు భారం పడే అవకాశాలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఎల్పజీ ధరలను పెంచడానికి చమురు కంపెనీలు కసరత్తు మొదలు పెట్టాయి. కనీసం 25 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.


Click it and Unblock the Notifications