ముంబై: బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ బ్యాక్డ్ CMS ఇన్ఫో సిస్టం(CMS) ఏటీఎం వ్యాపారం, క్యాష్ మేనేజ్‌మెంట్ బిజినెస్‌లో రూ.1300 కోట్ల పెట్టుబడుల ద్వారా మరింత విస్తరించాలని భావిస్తోంది. CMS ఇన్ఫో సిస్టం వైస్ చైర్మన్, హోల్‌టైమ్ డైరెక్టర్ రాజీవ్ కౌల్ మాట్లాడుతూ... తొలి విడతగా రూ.180 కోట్ల నుండి రూ.200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, దీంతో 2000 వరకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఇందులో 70 శాతం బ్లూకాలర్ జాబ్స్, మిగతా 30 శాతం వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయని తెలిపారు.

డెబిట్ రూపంలో ఫండ్స్
అంతర్గతంగా వనరులు, డెబిట్ రూపంలో ఫండ్స్ సమీకరించనున్నట్లు తెలిపారు. బేరింగ్‌కు ప్రధాన వాటా కలిగిన కంపెనీ ఏడేళ్ల కాలంలో రూ.1300 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. తద్వారా దేశీయంగా ఏటీఎంల నిర్వహణ, క్యాష్ మేనేజ్‌మెంట్ బిజినెస్ పెంచే యోచనలో ఉంది. ఈ పెట్టుబడులకు సంబంధించి బేరింగ్ నుండి ఏ మేరకు నిర్దిష్ట పెట్టుబడులు రానున్నాయో తెలియాల్సి ఉంది.

కాంట్రాక్ట్
బేరింగ్ ప్రయివేట్ ఈక్విటీ ఏషియా అనుబంధ సంస్థ సియోన్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ఈ కంపెనీలో 100 శాతం వాటాను కలిగి ఉంది. 3000 ఏటీఎంలను నిర్వహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సీఎంఎస్‌కు కాంట్రాక్ట్ లభించింది. ఇందులో భాగంగా స్థల ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసులు, రోజువారీ నిర్వహణ చేపట్టవలసి ఉంది. ఏడేళ్లపాటు అమలులో ఉండే కాంట్రాక్టును మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలు ఉంది.

రూ.5000 కోట్ల ట్రాన్సాక్షన్స్
CMSతో పాటు ఏటీఎం నిర్వహణలో ఏజీఎస్ ట్రాన్సాక్ట్, ఎస్ఐఎస్, రైటర్స్ కార్ప్ ఉన్నాయి. ఏటీఎం, నగదు నిర్వహణతో పాటు సీఎంఎస్ కార్డు పర్సనలైజేషన్ సేవలు కూడా అందిస్తోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ సెప్టెంబర్ నాటికి 1,13,981 ఆన్‌సైట్ ఏటీఎంలు, 96,068 ఆఫ్ సైట్ ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకులు అదనంగా 3,27,620 ఏటీఎంలు కలిగి ఉన్నాయి. సీఎంఎస్ రోజుకు రూ.5000 కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తోంది. FY20లో సంస్థ ఆదాయం రూ.1400 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications