రేపే అమ్మఒడి లబ్ధిదారుల జాబితా, 9వ తేదీన కొత్త స్కీం ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి పథకం జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పిల్లలను పాఠశాలలకు పంపించే నిరుపేద తల్లికి ఈ పథకం కింద రూ.15,000 ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఆర్థికస్థోమత లేక ఎంతోమంది పేదలు తమ పిల్లలను పాఠశాలకు పంపించలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. అమ్మఒడి పథకం కింద రూ.15వేలు ఇస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది.

తొలి బడ్జెట్లో రూ.6,455 కోట్లు.. 26 నుంచి 9కి మార్పు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లో రూ.6,455 వేల కోట్లు కేటాయించారు. మొదట జనవరి 26 నుంచి ప్రారంభించాలని షెడ్యూల్ ప్రకటించారు. అయితే దానిని మరింత ముందుకు జరిపి జనవరి 9వ తేదీకి మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రంలోని అర్హులైన తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

ఈ విద్యార్థులకు వర్తింపు
అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రయివేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. 1 నుంచి ఇంటర్ చదివే పేద విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.

గుర్తింపు రద్దుతో...
రాష్ట్రంలోని 61,271 స్కూళ్లు, 3,083 కాలేజీలకు ఇది వర్తిస్తుంది. కొన్ని పాఠశాలలు, కాలేజీల గుర్తింపు రద్దైన కారణంగా అమ్మఒడి వర్తింపు కాలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం 42,80,823 మంది తల్లులు లేదా సంరక్షకులను అర్హులుగా గుర్తించింది. మరో 13 లక్షల మందికి పైగా తల్లులు లేదా సంరక్షకుల పరిశీలన కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థళ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు.

రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నాక...
కొందరికి రేషన్ కార్డు లేనందున ఈ పథకానికి అనర్హులుగా గుర్తించారు. అయితే ఎవరైనా అర్హులైన వారికి రేషన్ కార్డు లేకపోతే దానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత తప్పకుండా అర్హులుగా గుర్తిస్తారు. అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితా జనవరి 2న ప్రకటించనున్నారు. జనవరి 9న అమ్మఒడి కార్యక్రమ ప్రారంభానికి ముందు 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 4న అమ్మఒడి, 6న మధ్యాహ్న భోజన పథకం అమలు, 7న ఇంగ్లిష్ మీడియం బోధన, ఆవశ్యకత, ఉపాధ్యాయులకు శిక్షణ, 8న మన పాఠశాల నాడు-నేడు అమలు, పాఠశాలల్లో వచ్చే మార్పులపై అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి.


Click it and Unblock the Notifications