Hyderabad: హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే..!
జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అనుమతులపై కేంద్ర మంత్రులతో వరసగా సమావేశం అవుతున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి చర్చించారు.
రీజనల్ రింగ్ రోడ్డు రెండు వైపులా ఒకే సారి పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని వివవరించారు. నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని కేంద్ర మంత్రి గడ్కరీకి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రహదారికి అవసరం అయిన అనుమతులు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరు చేయాలన్నారు. ఈ రహదారి పూర్తి అయితే హైదరాబాద్, విజయవాడ మధ్య 100 కిలోమీటర్లు తగ్గుతుందని వివరించారు.

హైదరాబాద్ సిటీ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతమవుతుందన్నారు. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు ఆరు వరుసల జాతీయ రహదారికి అనుమతులు మంజూరు చేయాలన్నారు.
ఈ రహదారి కోసం కావాల్సిన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ కొత్త రహదారి వల్ల వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోరంగా ఉంటుందని తెలిపారు.కేంద్ర మంత్రి గడ్కరీతో జరిగిన సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు పాటు పలువురు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications