CM Revanth Reddy: తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచపటంలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. దీని తర్వాత ప్రస్తుతం ఆయన సౌత్ కొరియాలో పెట్టుబడుల ఆకర్షన పర్యటనను కొనసాగిస్తున్నారు.
అమెరికా పర్యటన ఇటీవల ముగించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా రూ.31,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు. పర్యటనలో భాగంగా న్యూయార్క్, డల్లాస్, కాలిఫోర్నియాలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు.

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంతోపాటు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పలు కొత్త కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఈ క్రమంలో చర్చలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయడంతోపాటు వివిధ అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ఈ క్రమంలో నగరంలో ఏఐ కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో పాటు సెమీ కండక్టర్ కంపెనీల ఏర్పాటు, వివిధ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు కోసం సీఎం రేవంత్ టీమ్ పలువురు సీఈవోలతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా.. ఐటీ, జీసీసీ, లైఫ్ సైన్స్, ఫార్మాస్యూటికల్, డేటా సెంటర్లు, క్లౌడ్ అండ్ డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షణకు పలు ఒప్పందాలు జరిగాయి.
సీఎం రేవంత్ తాజా పర్యటనలో భాగంగా తెలంగాణలో ఫార్మాస్యూటికల్ పరిశోధనా సంస్థల ఏర్పాటుకు 12 అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయి. అలాగే హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న తన డేటా సెంటర్‌ను విస్తరించడానికి అమెజాన్ ఆమోదించినట్లు సమాచారం. యూఎస్ నుంచి సౌత్ కొరియా వెళ్లటానికి ముందు మాట్లాడిన సీఎం హైదరాబాద్ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలత తాజా పర్యటనలో లభించిందని పేర్కొన్నారు. తాజా పర్యటనలో జరిగిన ఒప్పందాలు రానున్న కాలంలో దాదాపు 30 వేలకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications