హలో ఫ్రెండ్ హౌ ఆర్ యూ.. రాజధాని అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీ.. కీలక చర్చలు..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ కీలక భేటీ జరిగింది. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు,ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చలు జరిగాయి.
సమావేశాల అనంతరం Bill Gates సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వం ఎలా రియల్ టైమ్ డేటాను ఉపయోగించి ప్రజాసేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందో సీఎం చంద్రబాబు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమ పథకాల అమలులో RTGS ద్వారా సాధించిన ఫలితాలను గేట్స్‌కు తెలియజేశారు. డేటా ఆధారిత పాలనతో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం వివరించారు.

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబు సవివరంగా వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అలాగే, మెడ్‌టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను గేట్స్ బృందానికి ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను గేట్స్ ప్రశంసించారు. ముఖ్యంగా వ్యవసాయంలో సాంకేతిక సాగు, డేటా ఆధారిత పంటల నిర్వహణ, రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై విస్తృత చర్చ జరిగింది.
సచివాలయంలో జరిగిన సమావేశాల్లో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న ప్రాజెక్టులను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో పాటు, కొత్త కార్యక్రమాలను ప్రారంభించే అవకాశాలపై కూడా చర్చించారు. ఆరోగ్య రంగంలో ఖర్చులను తగ్గించి, నాణ్యమైన సేవలను ప్రజలకు చేరువ చేయడంలో సాంకేతికత కీలకమని గేట్స్ అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశాలపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు పటిష్టమైన, ప్రభావవంతమైన పరిష్కారాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications