Quantum valley: అమరావతిలో 'క్వాంటం వ్యాలీ'.. ఇది నిజంగా ఏపీ భవిష్యత్తుని మార్చివేస్తుందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ రంగంలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ద్వారా ఐటీ విప్లవానికి నాంది పలికిన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అమరావతి వేదికగా 'డీప్ టెక్' విప్లవాన్ని ప్రారంభించారు. రీసెంట్ గానే భారతదేశపు మొట్టమొదటి 'క్వాంటం వ్యాలీ' కి అమరావతిలో శంకుస్థాపన జరిగింది. "క్వాంటం కంప్యూటింగ్ అనేది భవిష్యత్ టెక్నాలజీలన్నింటికీ తల్లి వంటిది" అని పేర్కొంటూ ఆయన తన విజన్‌ను పంచుకున్నారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ తలరాతను ఎలా మార్చబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్వాంటం టెక్నాలజీ అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యం?
సాధారణంగా మనం వాడే కంప్యూటర్లు సమాచారాన్ని 'బిట్స్' (0 లేదా 1) రూపంలో ప్రాసెస్ చేస్తాయి. కానీ, క్వాంటం కంప్యూటర్లు 'క్విబిట్స్' (Qubits) టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి ఒకే సమయంలో 0,1 రెండింటినీ ప్రాసెస్ చేయగలవు. దీనివల్ల సాధారణ సూపర్ కంప్యూటర్లు కూడా చేయలేని అతి క్లిష్టమైన లెక్కలను ఇవి సెకన్లలో పూర్తి చేస్తాయి. అందుకే ఏ దేశమైతే టెక్నాలజీని సృష్టిస్తుందో ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుందని, కేవలం ఇతరులు కనిపెట్టిన టెక్నాలజీని వాడుకునే వారు ఎప్పటికీ ఇతరులపై ఆధారపడే ఉంటారని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు.
కేవలం కొనుగోలు కాదు.. తయారీ!
ఈ ప్రాజెక్టు ఉద్దేశం కేవలం విదేశాల నుంచి క్వాంటం కంప్యూటర్లను తీసుకురావడం మాత్రమే కాదు. అమరావతిలోనే వీటిని స్వయంగా తయారు చేయడమే లక్ష్యం. రాబోయే ఐదేళ్లలో ఇక్కడ ఒక పూర్తిస్థాయి క్వాంటం , ఫ్రాంటియర్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను నిర్మించనున్నారు. దీనివల్ల కేవలం సాఫ్ట్‌వేర్ రంగమే కాకుండా హార్డ్‌వేర్ రంగంలో కూడా ఏపీ ప్రపంచ కేంద్రంగా మారనుంది.
ఏపీ భవిష్యత్తును మార్చే 'ఇన్నోవేషన్ స్టాక్'
ఈ క్వాంటం వ్యాలీతో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా మరిన్ని అత్యాధునిక రంగాలు అభివృద్ధి చెందబోతున్నాయి.. అవేంటంటే..
- AI లివింగ్ ల్యాబ్స్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనల కోసం ప్రత్యేక ప్రయోగశాలలు.
- స్పేస్ సిటీ & డ్రోన్ సిటీ: అంతరిక్ష పరిశోధనలు, డ్రోన్ టెక్నాలజీలో ప్రత్యేక హబ్‌లు.
- ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ & సెమీకండక్టర్లు: విమానయాన రంగం , చిప్ తయారీలో విప్లవాత్మక మార్పులు.
- మెడ్-టెక్: ధరించగలిగే (wearables) వైద్య పరికరాలు, అధునాతన వైద్య చికిత్సలు. వీటన్నింటికీ క్వాంటం టెక్నాలజీయే ప్రధాన శక్తిగా (Power house) నిలుస్తుంది.
ఐటీ నుంచి డీప్ టెక్ వరకు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే. అందులోనూ దాదాపు 35 శాతం మంది ఆంధ్రప్రదేశ్ వారే కావడం విశేషం. అయితే ఇకపై మనం కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకూడదని, భారతదేశం నుంచి ప్రపంచం కోసం ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. హైటెక్ సిటీ ద్వారా సాధించిన ఐటీ విప్లవాన్ని మించి, అమరావతి వేదికగా అంతకంటే పెద్ద ఎత్తున మరింత ప్రభావవంతంగా ఈ డీప్ టెక్ విప్లవం సాగబోతోంది.
గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆహ్వానం
భారతదేశం ఒకప్పుడు పారిశ్రామిక విప్లవాన్ని మిస్ అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపన కేవలం ఒక భవనం కట్టడం కాదు, ఇది భావితరాల బంగారు భవిష్యత్తుకు వేసిన పునాది అని సీఎం చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయని అంటున్నారు. మరి ఈ టెక్నాలజీ మన ఆర్థిక వ్యవస్థను, సామాజిక జీవనాన్ని ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications