Telangana News: రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఫ్యామిలీ గిఫ్ట్..!! రూ.200 కోట్లకు పైగా..
Heritage Stock: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి పాల వ్యాపారం ఉన్న సంగతి తెలిసిందే. హెరిటేజ్ బ్రాండ్ పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణలో భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది.
ఈ క్రమంలో హెరిటేజ్ కంపెనీ తెలంగాణలోని షామీర్‌పేట్‌లో కొత్త ఐస్‌క్రీం తయారీ కేంద్రాన్ని స్థాపించాలని చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రణాళికను కంపెనీ బోర్డు ఆమోదించినట్లు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రకటించింది. కొత్త ఐస్ క్రీం ప్లాంట్ నిర్మాణానికి కంపెనీ దాదాపు రూ.204 కోట్లను వెచ్చించనుంది. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ప్రాంతీయ డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం వచ్చిందని తెలుస్తోంది. ఈ తయారీ యూనిట్ వచ్చే ఏడాది నవంబర్ నాటికి అందుబాటులోకి రానుందని సమాచారం.

హెరిటేజ్ సంస్థ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లటానికి అంతర్గతంగా సేకరించిన నిధులతో పాటు రుణాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం కంపెనీ పాలు, పాల ఉత్పత్తులు, రెన్యూవబుల్ ఎనర్జీ, పశువుల మేతలకు సంబంధించిన వివిధ వ్యాపారాలను నిర్వహిస్తోంది. కంపెనీ కొత్తగా విస్తరణ ప్రణాళికలను ప్రకటించినప్పటికీ మార్కెట్లో ట్రేడర్ల నుంచి దీనికి సానుకూలత కనిపించలేదు. వరుసగా మూడోరోజు సైతం హెరిటేజ్ స్టాక్ నష్టాల్లోనే తన ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో నేడు ఎన్ఎస్ఈలో స్టాక్ 1.47 శాతం నష్టంతో రూ.570.15 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించింది. డెయిరీ విభాగంలో కంపెనీ పాలు, పాల ఉత్పత్తులు, ఐస్ క్రీమ్స్, ఫ్రోజెన్ డెజర్ట్స్ వంటి విభిన్న ఉత్పత్తులను విక్రయిస్తోంది.
నవంబర్ 1996లో హెరిటేజ్ ఫుడ్స్ పబ్లిక్ కంపెనీగా మారింది. హెరిటేజ్ ఫుడ్స్ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ డెయిరీ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. కంపెనీ తన పాల ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, NCR దిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని రూ.16.74 కోట్లుగా నమోదు చేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.58.43 కోట్లకు పెరిగింది. FY25 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11.8% పెరిగి రూ.1,032.67 కోట్లకు చేరుకుంది. తెలంగాణలో కొత్త ఐస్‌క్రీం సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ బోర్డు ఓకే చేయటం సానుకూలమైన అంశంగా భావించినప్పటికీ మార్కెట్లో ఆ ప్రభావం కనిపించలేదు.


Click it and Unblock the Notifications