Citi Bank: ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు పలు సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ప్రభుత్వాలు ఇచ్చిన సౌలభ్యాలు కొన్ని కాగా.. వాటికి అదనంగా మరిన్నిటిని జోడించి సిబ్బంది మనసు గెలుచుకుంటాయి. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ప్రస్తుతం ఇదే పని చేసింది. తన మహిళా ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది.
మహిళా ఉద్యోగుల కోసం సిటీ బ్యాంక్ కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని ప్రవేశపెట్టింది. 26 వారాల ప్రసూతి సెలవుల అనంతరం మరో 12 నెలల వరకు రిమోట్ గా పని చేసేందుకు అనుమతిస్తోంది. ఇందుకు అదనంగా గర్భదారణ చివరి మూడు నెలలకు గాను WFHని అభ్యర్థించే అవకాశం కల్పించింది. అయితే కంపెనీ సమీక్ష మరియు ఆమోదానికి లోబడి ఉంటుంది.

ఈ కొత్త విధానం వల్ల మొత్తంగా 21 నెలల పాటు WFH విధానంలో పనిచేసే అవకాశం గర్భం ధరించిన మహిళలకు లభిస్తోంది. 2021లో ప్రభుత్వం ప్రతిపాదించిన సూచనలకు అనుగుణంగా.. ప్రసూతి శెలవులతో అనంతరం WFH అమలు చేసిన మొదటి సంస్థల్లో సిటీ ఇండియా ఒకటిగా నిలుస్తోంది. మాజీ MD&CEO చందా కొచ్చర్ ఆధ్వర్యంలో ICICI బ్యాంక్ కూడా iWork@home ఇనీషియేటివ్ ప్రారంభించింది.
మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సిటీ ఇండియా & సౌత్ ఆసియా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఆదిత్య మిట్టల్ తెలిపారు. "ప్రసూతి అనంతరం మహిళలు తరచుగా విరామం తీసుకుంటారని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది వారి కెరీర్ ను ప్రభావితం చేస్తుంది. మేము దీనిని మార్చాలని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.
సిటీ బ్యాంక్ కి ఇండియాలో 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 38 శాతం మంది మహిళలు. కొత్త పాలసీ వల్ల ప్రసూతి అనంతరం తమ కెరీర్ కొనసాగించడానికి సహాయపడుతుంది అని మహిళా సిబ్బంది భావిస్తున్నారు. 2021లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ ను పరిచయం చేసిన మొదటి వాల్ స్ట్రీట్ బ్యాంక్ ఇదే కావడం విశేషం.


Click it and Unblock the Notifications