సిటీ బ్యాంక్ రూ.6,700కోట్ల శతాబ్దపు పొరపాటు, తిరిగిచ్చేందుకు వారు నో
సిటీ బ్యాంకు చేసిన చిన్న పొరపాటు ఆ బ్యాంకుకు ఇరకాటంలోకి నెట్టింది. ఈ బ్యాంకు న్యూయార్క్ శాఖలో జరిగిన పొరపాటు మామూలు విషయం కాదని, ప్రస్తుత కాలంలో జరిగిన అతిపెద్ద పొరపాటుగా విశ్లేషకులు చెబుతున్నారు. సౌందర్య ఉత్పత్తుల దిగ్గజం రెవ్లాన్ ఇంక్‌కు చెందిన రూ.900 మిలియన్ డాలర్లను (రూ.6,700 కోట్లకు పైగా) పొరపాటున ఆ కంపెనీ రుణదాతల అకౌంట్లలోకి వేసింది. క్లరికల్ లోపం కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.

అనుకోకుండా రుణదాతల అకౌంట్లలోకి..
కరోనా కారణంగా రెవ్లాన్ ఆర్థికంగా చితికిపోయింది. రుణదాతలకు దాదాపు 3 బిలియన్ డాలర్ల మేర బకాయి పడింది. సకాలంలో చెల్లింపు జరగకపోవడంతో రుణాలు ఇచ్చిన సంస్థలు అసహనంతో ఉన్నాయి. టర్మ్ లోన్‌ను 2023 లోపు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెవ్లాన్‌పై కేసులు వేశాయి. ఈ కేసులో సిటీ బ్యాంకును ప్రతివాదిగా చేర్చాయి. ఈ పరిస్థితుల్లో 900 మిలియన్ డాలర్ల మొత్తాన్ని క్లరికల్ ఎర్రర్ కారణంగా రెవ్లాన్ ఖాతా నుండి రుణదాతల ఖాతాల్లోకి వెళ్లింది. అప్పటికే తమ బకాయిలు తిరిగి చెల్లించే అంశానికి సంబంధించి రుణదాత సంస్థలు అసహనంతో ఉన్నాయి. ఇప్పుడు తమ అకౌంట్లలో డబ్బులు పట్టాయి. దీంతో అవి ఊరట పొందాయి.

తిరిగి ఇచ్చేందుకు నో
రెవ్లాన్ అకౌంట్ నుండి తమ ఖాతాల్లో పడిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు రుణసంస్థలు నిరాకరిస్తున్నాయి. శుక్రవారం నాటికి మెజార్టీ రుణసంస్థలు వెనక్కి ఇచ్చే సంకేతాలు కనిపించలేదు. ఇది బిలియన్ డాలర్ల క్లరికల్ లోపమని ఫార్మర్ రీస్ట్రక్చరింగ్ అండ్ బ్యాంక్రప్టసీ అడ్వైజర్ మైఖేల్ స్టాంటోన్ అన్నారు. ఇలాంటి పొరపాటు చాలా దారుణమని, దాదాపు బిలియన్ డాలర్ల మేర అకౌంట్లలోకి వెళ్లడం ఈ శతాబ్దానికే అతిపెద్ద పొరపాటు అని చెబుతున్నారు. పెట్టుబడిదారులు కోరుకున్నది ఇదేనని, అలాంటప్పుడు ఎలా ఇస్తారని అంటున్నారు.

ఇదెలా జరిగింది.. అవాక్కవుతున్న ఫైనాన్షియల్ మార్కెట్
దాదాపు బిలియన్ డాలర్ల మేర పొరపాటున రుణదాతల అకౌంట్లలోకి వెళ్లడంపై ఫైనాన్షియల్ మార్కెట్లు అవాక్కవుతున్నాయి. అందరి మదిలో ఒకటే ప్రశ్న.. ఇలా ఎలా జరిగింది, ఎలా సాధ్యమని. వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద పొరపాటుగా చెబుతున్నారు.

తమకు సంబంధం లేదని రెవ్లాన్
ఈ చెల్లింపు మొత్తంగా కానీ, ఇందులో భాగం కానీ తాము చేసింది కాదని, అసలు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని రెవ్లాన్ తెలిపింది. ఇది సిటీ బ్యాంకులో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత దర్యాఫ్తును ప్రారంభించింది.


Click it and Unblock the Notifications