ముంబై: కరోనా మహమ్మారి డ్రగ్ ఫెవిపిరవిర్‌ను విడుదల చేసేందుకు ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ సిప్లా సిద్ధమైందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) గురువారం నాడు వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సీన్ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఫెవిపిరవిర్ వంటి ఔషధాలను కరోనా పేషెంట్స్ కోసం ఉపయోగిస్తున్నారు.

సిప్లాకు బదలాయింపు
తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. స్థానికంగా లభ్యమయ్యే రసాయనాలతో ఈ మందును అభివృద్ధి చేసింది సీఎస్ఐఆర్. ఈ టెక్నాలజీని సిప్లాకు బదలాయించింది. ఈ మేరకు CSIR సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

త్వరలో మార్కెట్లోకి..
పెవిపిరవిర్‌ను సీఎస్ఐఆర్ అభివృద్ధి చేసిందని, ఈ ఔషధం త్వరలో మార్కెట్లోకి వస్తుందని ప్రకటించింది CSIR. తాము అభివృద్ధి చేసిన ఈ ఔషధం సమర్థవంతంగా పని చేస్తోందని, తక్కువ వ్యవధిలోనే ఔషధ తయారీదారులు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైందని డైరెక్టర్ తెలిపారు. మోస్తారు నుండి మధ్యస్థంగా కరోనాతో బాధపడుతున్న వారికి ఈ ఫెవిపిరవిర్‌ను ఉపయోగించవచ్చునని, ఇది మంచి ఫలితాలు ఇస్తోంది.

కరోనా డ్రగ్ మరింత తగ్గే అవకాశం
గ్లెన్‌మార్క్ ఫార్మా ఫావిఫ్లూ ఔషధం ప్రస్తుతం మార్కెట్లో ఉంది. ఇది రూ.104గా ఉన్న ధరను 27 శాతం తగ్గించి రూ.75కు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆప్లిమస్ ఫార్మాకు ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు, ఎగుమతి చేసేందుకు అనుమతి వచ్చింది. ఫెవిపిరవిర్ టాబ్లెట్స్ తయారీ, విక్రయానికి తమకు డీసీజీఐ నుండి అనుమతి వచ్చినట్లు బ్రింటన్ ఫార్మా తెలిపింది. ఇప్పుడు సిప్లా కూడా మార్కెట్లోకి తీసుకు రానుంది. సిప్లా తయారు చేసే ఔషధం చౌకగా లభించే అవకాశం ఉండటంతో ఇంకా తక్కువ ధరకే ఫెవిపిరవిర్ ట్యాబ్లెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మిగతా కంపెనీలు అదే దారిలో నడువొచ్చు.


Click it and Unblock the Notifications