పొగతాగే అలవాటు ఉన్నవారి జేబుకు ఇక చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. భారత ప్రభుత్వం సిగరెట్లపై పన్నుల విధానంలో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ సిగరెట్లపై ప్రత్యేక 'సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ'ని పునరుద్ధరించింది. దీనివల్ల ఫిబ్రవరి 1, 2026 నుండి సిగరెట్ ధరలు అమాంతం పెరగనున్నాయి. అయితే ఈసారి ధరల పెరుగుదల అనేది బ్రాండ్‌తో పాటు మీరు తాగే సిగరెట్ పొడవు (Length) మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కొత్త ట్యాక్స్ రూల్స్ ఏంటి?
ఇప్పటివరకు సిగరెట్లపై కేవలం GSTతో పాటు కాంపెన్సేషన్ సెస్ మాత్రమే ఉండేవి. కానీ, కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి 1,000 సిగరెట్ స్టిక్స్‌పై ప్రభుత్వం నిర్దిష్టమైన ఎక్సైజ్ డ్యూటీని విధించింది.
- 65 mm లోపు (ఫిల్టర్ లేనివి): 1,000 స్టిక్స్‌కు రూ.2,050 పన్ను.
- 70-75 mm (ఫిల్టర్ ఉన్నవి): 1,000 స్టిక్స్‌కు రూ.5,400 పన్ను.
- ప్రీమియం/కింగ్ సైజ్: 1,000 స్టిక్స్‌కు ఏకంగా రూ. 8,500 వరకు పన్ను పడనుంది.
ఒక్కో సిగరెట్ ధర ఎంత పెరుగుతుంది?
సామాన్యంగా మనకు రిటైల్ షాపుల్లో దొరికే సిగరెట్ ధర (cigarette cost) ఒక్కో స్టిక్ మీద లెక్కవేస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది..
- చిన్న సిగరెట్లపై ఒక్కో స్టిక్‌కు సుమారు రూ. 2.05 నుండి రూ. 2.10 వరకు పెరుగుతుంది.
- మీడియం సైజ్ (65-70 mm) సిగరెట్లపై రూ.3.60 నుండి రూ.4.00 వరకు పెరగొచ్చు.
- కింగ్ సైజ్ లేదా ప్రీమియం సిగరెట్లపై ఒక్కో స్టిక్‌కు రూ. 5.40 నుండి రూ. 8.50 పైనే భారం పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం రూ. 18 కి దొరుకుతున్న ప్రీమియం సిగరెట్.. ఫిబ్రవరి నుంచి రూ. 22 నుండి రూ. 25 మధ్యకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రధాన బ్రాండ్లపై ప్రభావం
ఈ కొత్త ట్యాక్స్ వల్ల గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం, క్లాసిక్, మాల్ బోరో, నేవీ కట్ వంటి పాపులర్ బ్రాండ్ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. కంపెనీలు ఈ పన్ను భారాన్ని పూర్తిగా కస్టమర్ల మీదకే మళ్లించే అవకాశం ఉండటంతో.. సిగరెట్ తాగడం ఇకపై ఖరీదైన వ్యవహారంగా మారనుంది.
ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు రాబడి చేకూర్చడం ఒక ముఖ్యమైన లాభం. అలాగే రెండో కారణం ప్రజారోగ్యం. ధరలు పెంచడం ద్వారా ధూమపానాన్ని కొంతవరకూ తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనలను పాటిస్తోంది. దీంతోపాటు ఈ నిర్ణయం పన్ను ఎగవేతకు అడ్డుకట్టగా నిలుస్తోంది. పద్ధతి ప్రకారం సైజుల వారీగా పన్ను వేయడం ద్వారా పారదర్శకత తీసుకురావాలని చూస్తోంది.
ఏదేమైనా ఫిబ్రవరి 1 నుంచి మీరు కొనే సిగరెట్ సైజును బట్టి మీ జేబు నుంచి అదనపు డబ్బులు తీయక తప్పదు. ఆరోగ్యం దృష్ట్యా చూసినా, ఆర్థికంగా చూసినా ఈ అలవాటును తగ్గించుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications