Stock Ideas: గడచిన దీపావళి నుంచి ఇప్పటి వరకు సంవత్ 2079లో దేశీయ స్టాక్ మార్కెట్లు మెరుగైన పనితీరును కనబరిచాయి. గ్లోబల్ మార్కెట్లలో ఒడిదొడుకులు, పతనం ఉన్నప్పటికీ బీఎస్ఈ లార్జ్ క్యాప్ 8 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 33 శాతం రాబడులను అందించాయి.
ఈ క్రమంలో హిందువుల నూతన సంవత్సరంగా భావించే సవంత్ 2080 కోసం చాయిస్ బ్రోకింగ్ సంస్థ పెట్టుబడికి అనుకూలమైన కంపెనీలను ఇన్వెస్టర్లకు సూచిస్తోంది. ఈ క్రమంలో ముందుగా యథార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ కంపెనీ షేర్లు మంచి రాబడిని అందిస్తాయని సూచించింది. ఇది దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ కలిగి ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.372 ఉండగా.. టార్గెట్ ధర రూ.523గా బ్రోకరేజ్ వెల్లడించింది. అంటే ఇన్వెస్టర్లు దాదాపు 40 శాతం లాభాలను పొందనున్నారు.

బ్రోకరేజ్ ఎంచుకున్న రెండవ కంపెనీ భారత్ డైనమిక్స్. ఇది మిలిటరీ ఆయుధాల తయారీ రంగంలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. దేశీయ మిలిటరీ అవసరాలు తీర్చటంలో కంపెనీ ఉన్నందున బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.1,038 ఉన్నప్పటికీ రానున్న కాలంలో 29.5 పెరిగి రూ.1,346ను చేరుకుంటుందని పేర్కొంది. ఇదే క్రమంలో లుమ్యాక్స్ ఆటో టెక్నాలజీస్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు అనువైనవిగా పేర్కొంది. ఈ స్టాక్ ప్రస్తుతం ధర రూ.336గా ఉన్నప్పటికీ రానున్న కాలంలో రూ.457ను తాకుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.
ఇక నాలుగో షేరుగా మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ కంపెనీ షేర్లను చాయిస్ బ్రోకరేజ్ రానున్న ఏడాది కోసం సూచించింది. కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టడంపై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.495 వద్ద ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో రూ.594ని చేరుకుంటుందని పేర్కొంది. ఇక 5వ కంపెనీ దాల్మియా భారత్. సిమెంట్ వ్యాపారంలో ఉన్న కంపెనీ అధిక డిమాండ్ చూస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవటంపై ఎక్కువగా దృష్టి సారించిందని బ్రోకరేజ్ గుర్తించింది. ప్రస్తుతం షేర్ ధర రూ.2,109 వద్ద ఉన్నప్పటికీ రానున్న కాలంలో రూ.2,515 స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. అలాగే కంపెనీ రేటింగ్ కూడా మెరుగుపడుతోంది.
ఇదే క్రమంలో కంపెనీ ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్ షేర్లను ఇన్వెస్టర్లకు బ్రోకరేజ్ సూచిస్తోంది. కంపెనీ మంచి ఆర్డర్ బుక్ కలిగి ఉంది. ఇది ఆటోమోటివ్స్, మెడికల్ రంగాల్లో పరిష్కారాలను అందిస్తోంది. ప్రస్తుతం షేర్ ధర రూ.4,270 ఉండగా రూ.5,090ని చేరుకుంటుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఇక ఐటీ సేవల రంగంలో ప్రముఖ కంపెనీగా ఉన్న టీసీఎస్ షేర్లు మంచి రాబడులను అందిస్తాయని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. దీంతో ప్రస్తుతం రూ.3,389 వద్ద ఉన్న స్టాక్ ధర రూ.4,040కి చేరుకుంటుందని పేర్కొంది. ఇక చివరగా చాయిస్ బ్రోకరేజ్ భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షేర్లపై తన సానుకూలతను ప్రకటించింది. ప్రత్యేక పరికరాల తయారీలో అగ్రగామిగా కంపెనీ ఉండటంతో దీనిని ఎంచుకుంది. ప్రస్తుతం షేర్ ధర రూ.138 వద్ద ఉండగా రానున్న కాలంలో రూ.151ని చేరుకుంటుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications