న్యూఢిల్లీ: చైనాకు చెందిన పారిశ్రామిక దిగ్గజ సంస్థ హువావె భారత్‌లో లేఆఫ్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు చెలరేగుతుండటం, టిక్‌టాక్ సహా ఆ దేశానికి చెందిన యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ప్రస్తుత పరిస్థితుల మధ్య.. హువావె ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హువావె లేఆఫ్‌ను ప్రకటించడం ఖాయమని, ఫలితంగా-60 నుంచి 70 శాతం వరకు భారతీయ ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన వివాదాలు, ఉద్రిక్త పరిస్థితుల అనంతరం దేశీయ మార్కెట్‌లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కిందటి నెల 16, 16 తేదీల్లో రెండు దేశాలకు చెందిన సైన్యం మధ్య ఘర్షణలు తలెత్తడం, 20 మంది జవాన్లు వీర మరణం పొందడంతో చైనాపై మరింత వ్యతిరేకత చెలరేగింది. రైల్వే, టెలికం మంత్రిత్వ శాఖలు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది.

ఈ పరిణామాలన్నీ ఆర్థికంగా నష్టాన్ని హువావె సంస్థ అంచనా వేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 700-800 మిలియన్ డాలర్ల వరకు వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించాలని హువావె సంస్థ ఇదివరకు లక్ష్యంగా నిర్దేశించుకుంది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకున్న తరువాత.. ఈ సంస్థ ఈ లక్ష్యాన్ని సవరించింది. 350 నుంచి 500 మిలియన్ డాలర్లకు కుదించింది. దీన్ని కూడా అందుకోవడం కష్టసాధ్యమనే అభిప్రాయం హువావే యాజమాన్యంంలో తలెత్తిందని ఆంగ్ల పత్రిక తన కథనంలో ప్రచురించింది.
దీనితో ఖర్చులను తగ్గించుకునే దిశగా చర్యలను చేపట్టిందని పేర్కొంది. ఇందులో భాగంగా- ఉద్యోగులను 60 నుంచి 70 శాతం వరకు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాసుకొచ్చింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్‌డీ) విభాగంలో పనిచేసే భారతీయ ఉద్యోగులను మాత్రం యధాతథంగా కొనసాగించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ టెలికం రంగానికి చెందిన పరిశ్రమలు కూడా హువావె వంటి చైనా కంపెనీలు తయారు చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులను పెద్ద సంఖ్యలో వినియోగించడం కూడా దీనికి ఓ కారణమైనట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications