Maldives News: చైనా దూకుడుకి ఇండోనేషియా బ్రేక్.. బెడిసికొట్టిన మాల్దీవుల స్కెచ్
China research ship: మాల్దీవుల మంత్రులు భారత్ సహా ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆర్థికంగా ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో మన శత్రువు చైనాతో దోస్తీ ద్వారా జరిగిన నష్టాన్ని సరిచేయాలని భావిస్తోంది. అందుకే డ్రాగన్ చెప్పినట్లు ఆడుతోంది. శ్రీలంక వద్ద గతంలో తిష్టవేసిన చైనా పరిశోధన నౌకకు.. ఇప్పుడు మాల్దీవులు ఆశ్రయం ఇవ్వడానికి రెడీ అయింది.
ఈ ప్రయాణంలో చైనా నౌక తన ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను ఆఫ్ చేయడంతో.. ఇండోనేషియా కోస్ట్ గార్డ్ (ICG) దాన్ని నిలిపివేసినట్లు మీడియా నివేదించింది. జనవరి 8-12 మధ్య షిప్ ఇండోనేషియా జలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు.. నౌకలోని సిబ్బంది ట్రాన్స్‌పాండర్‌ను మూడుసార్లు ఆఫ్ చేసిన తర్వాత ఇండోనేషియా ఈ చర్యలు తీసుకుంది. ఇదే విషయాన్ని US నావల్ ఇన్‌స్టిట్యూట్ సైతం ధ్రువీకరించింది.

ఓడ స్థానం, గుర్తింపుతో పాటు ఇతర సమాచారాన్ని ట్రాన్స్‌పాండర్‌లు స్వయంచాలకంగా ఇతర నౌకలు సహా తీర ప్రాంత అధికారులకు అందిస్తాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఇండోనేషియా జలాల్లో ప్రయాణించే అన్ని నౌకలు తప్పనిసరిగా పనిచేసే ట్రాన్స్‌పాండర్‌లను కలిగి ఉండాలి. కానీ ఓడలోని సిబ్బంది మాత్రం అది విరిగిపోయిందంటూ కుంటి సాకులు చెప్పడంతో ఇండోనేషియా చర్యలకు దిగింది.
జనవరి 22న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు చైనా నుంచి తిరిగి వచ్చిన వారాల వ్యవధిలోనే డ్రాగన్ నౌక మాలే వైపు వెళ్తున్నట్లు ఓ పరిశోధకుడు వెల్లడించాడు. దీంతో ఆ దేశ విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించాల్సి వచ్చింది. కానీ మాల్దీవుల భూభాగంలో పరిశోధన కార్యకలాపాలు నిర్వహించదని ప్రకటించింది. అయితే పరోక్షంగా ఇండియాకు చెక్ పెట్టేందుకు చైనా డేటా కలెక్ట్ చేస్తున్నట్లు రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications