Zomato: జొమాటోకు మరో ఎదురుదెబ్బ.. వాటాలు విక్రయిస్తున్న ఆలీబాబా గ్రూప్..
Zomato: చైనాలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్న అలీబాబా గతంలో తన రెండు అనుబంధ సంస్థల ద్వారా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో పెట్టుబడులను పెట్టింది. అలా అలీబాబాకు కంపెనీలో దాదాపు 13 శాతం వాటా ఉంది. అయితే ఈరోజు బ్లాక్ డీల్ ద్వారా 200 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తాసంస్థ నిన్న సాయంత్రం వెల్లడించింది.

తాజా విక్రయం..
తాజా బ్లాక్ డీల్ ద్వారా యాంట్ ఫైనాన్షియల్, అలిపే జొమాటోలో తమ వాటాను సుమారు 10 శాతానికి తగ్గించుకుంటాయని తెలుస్తోంది. దాదాపు 5-6 శాతం తగ్గింపు ధరకు ఈ డీల్ జరగనున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్ ను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ బ్రోకర్‌గా వ్యవహరించనుంది.

పతనమైన జొమాటో..
కరోనా తరువాత జొమాటో కంపెనీ ఆదాయాల విషయంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ.. దాని షేర్ విలువ మాత్రం భారీగా పతనమైంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జొమాటో షేర్ దాదాపు 55 శాతానికి పైగా పడిపోయింది.

వీడుతున్న దిగ్గజాలు..
పెట్టుబడులకు లాక్ ఇన్ పిరియడ్ ముగియటంతో పెద్ద ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయిస్తున్నారు. ఆగస్టులో సీక్వోయా క్యాపిటల్ ఇండియా, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, ఉబెర్, డెలివరీ హీరోలతో సహా కొన్ని అతిపెద్ద వాటాదారులు బ్లాక్ డీల్స్ లేదా ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా తమ వాటాలను తగ్గించుకున్నారు. ఇప్పుడు తాజాగా చైనా దిగ్గజ కంపెనీ ఆలీబాబా సైతం ఈ జాబితాలో చేరింది.

ఇన్వెస్టర్స్..
ఈరోజు ఉదయం 9.20 గంటల సమయంలో స్టాక్ ధర రూ.64.35గా ఉంది. అయితే ఈ కంపెనీ 52 వారాల గరిష్ఠ ధర రూ.158 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.40.60గా ఉంది. లిస్టింగ్ సమయం ధర నుంచి స్టాక్ చాలా విలువను కోల్పోవటంతో ఇన్వెస్టర్లు ఈ టెక్ స్టార్టప్ కంపెనీ షేర్లపై ఆందోళనగా ఉన్నారు. అయితే ఈ డీల్ జరిగితే అది కంపెనీ షేర్లను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications