Flight Tickets: పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈరోజుల్లో 100 రూపాయలకు ఏమీ రావడం లేదు. అదే డబ్బుతో ఎంచక్కా విమాన ప్రయాణం చేయొచ్చని తెలిస్తే, ఎగిరి గంతేసి మరీ టిక్కెట్ కొనేస్తాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చైనాలో జరిగింది. జనం ఎగబడి టిక్కెట్స్ కొన్నారు.
చైనీస్ విమానయాన సంస్థ 'చైనా సదరన్' కొన్ని దేశీయ విమానాలపై భారీ తగ్గింపుతో టిక్కెట్స్ జారీచేసింది. మన కరెన్సీలో కేవలం 83 రూపాయలకే ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం కల్పించింది. విషయం తెలిసిన ప్రజలు ఎగబడి మరీ టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఎంచక్కా విమానం ఎక్కేందుకు సిద్ధమైపోయారు.

తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. సిస్టమ్‌లో తలెత్తిన లోపం కారణంగా టిక్కెట్ ధరలు తప్పుగా చూపించినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు గుర్తించారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ కాస్తా జరిగిపోయింది. తక్కువ ధరకు టిక్కెట్లు కొన్న వినియోగదారులు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేశారు. దాంతో టిక్కెట్లు విపరీతంగా సేల్ అయ్యాయి.
ఈ ఘటనపై చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా వీబోలో స్పందించింది. సిస్టమ్ గ్లిచ్ కారణంగా టిక్కెట్ ధరలు భారీగా తగ్గినట్లు ప్రకటించింది. అయితే ధరలతో సంబంధం లేకుండా ఆ సమయంలో కొనుగోలు చేసిన అన్ని టిక్కెట్‌లు చెల్లుబాటు అవుతాయని ప్రయాణికులకు హామీ ఇచ్చింది.
విమాన ఛార్జీలకు సంబంధించి ఇలా షాక్ లు తగలడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఏప్రిల్‌లోనూ కరెన్సీ లోపం కారణంగా ప్రయాణీకులు జపనీస్ ఎయిర్‌లైన్ ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌లో కేవలం 300 డాలర్లకు రౌండ్‌ట్రిప్ టిక్కెట్‌లను పొందగలిగారు. కానీ వాటి అసలు ధర 10 వేల డాలర్లు కావడంతో.. విమానయాన సంస్థ వాటిని రద్దు చేసింది. తప్పుగా ప్రాసెస్ చేయబడిన లావాదేవీలకు సంబంధించి డబ్బును వాపసు చేసింది.


Click it and Unblock the Notifications