Diwali Alert: హ్యాపీ దీపావళి అంటూ దోచేస్తున్నారు..! అసలు ఎవర్రా వీళ్లంతా..? పూర్తి వివరాలు..
Diwali Alert: సందు దొరికితే చాలు జనం డబ్బులు ఎలా నొక్కేదామా, వారి పర్సనల్ సమాచారాన్ని ఎలా తస్కరిద్దామా అని రెడీగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ప్రస్తుతం దీపావళి, పొంగల్ పండుగల కారణంగా తెలిసిన వారు, స్నేహితులు శుభాకాంక్షలు పంపుకుంటుంటారు. అయితే అసలు సమస్య ఏంటంటే హ్యాపీ దివాలీ అంటూనే బ్యాంక్ ఖాతాలను మాయగాళ్లు కొల్లగొడుతున్నారు.

పండుగ శుభాకాంక్షలు..
దీపావళి సందర్భంగా చాలా మందికి స్పెషల్ గిఫ్ట్స్, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేస్తే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ కమిటీ హెచ్చరించింది.

చైనా చోరులు..
చైనా కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని వెబ్‌సైట్లు భారతీయులను లక్ష్యంగా చేసుకుని దీపావళి సందేశాలను పంపుతున్నాయని తేలింది. వారు ముఖ్యంగా మహిళలకు ఈ లింక్‌లను పంపుతున్నాయని తేలింది. వాటిలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే.. దీపావళి బహుమతులు పొందేందుకు వివరాలు ఉంటాయి. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలను అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని భారతీయ సైబర్ సెక్యూరిటీ కమిటీ తెలియజేసింది. పొరపాటున వివరాలు అందిస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

నగల కంపెనీ..
ప్రముఖ ఆభరణాల కంపెనీ లోగోతో కూడిన ఫేక్ వెబ్‌సైట్ ద్వారా ఇటీవల కొంతమంది కస్టమర్లకు ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు వచ్చాయి. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సంబంధం లేని వారి నుంచి వస్తే వెంటనే డిలీట్ చేయాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా గ్రీటింగ్ మెసేజ్‌లో లింక్ ఉంటే దానిపై అస్సలు క్లిక్ చేయెుద్దంటున్నారు.

బి అలర్ట్..
పండుగ శుభాకాంక్షల మాటున జరుగుతున్న ఇలాంటి మోసాలను నివారించడానికి, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్న గ్యాంగ్ చేతికి చిక్కొద్దుమరి.


Click it and Unblock the Notifications