ఆహార వృథా నియంత్రణకు చైనా కొత్త చట్టం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు...
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా మూడింట ఒక వంతు ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. లెక్కల్లో చెప్పాలంటే ప్రతీ ఏటా 1.3 బిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఇందులో ఒక్క చైనాలోనే దాదాపు 17 మిలియన్ టన్నుల ఆహారం వృథాగా పోతుంది. ఈ ఆహారంతో దాదాపు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల మంది ఆకలి తీర్చవచ్చు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఆహార వృథాను తీవ్రంగా పరిగణిస్తోంది. దీన్ని నియంత్రించడం కోసం ఇటీవలే కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది.
చైనా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం... ఆహార వృథాను నియంత్రించేందుకు హోటళ్లు,రెస్టారెంట్లలో ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. ఈ సిబ్బంది ఆహారం వృథా చేసేవారిని గుర్తించి వారిస్తారు. అతిగా ఫుడ్ ఆర్డర్ చేసేవారిని ముందుగానే హెచ్చరిస్తారు.మిగిలిపోయిన ఆహార పదార్థాలను టేబుల్‌పై వదిలి వెళ్లకుండా... ప్యాక్ చేసి తీసుకెళ్లమని చెప్తారు.

ఈ చట్టం ప్రకారం.. హోటల్స్,రెస్టారెంట్స్,క్యాటరింగ్ సర్వీస్ చేసే సంస్థలు తక్కువ పరిమాణంలో మాత్రమే కస్టమర్స్‌కు ఫుడ్‌ను విక్రయించాల్సి ఉంటుంది. భారీ పరిమాణంలో ఫుడ్‌ని విక్రయించి ఆహార వృథాకు కారణమైతే వారిపై చర్యలు తప్పవు. ఇందుకు గాను వారికి 10వేల యువాన్లు జరిమానాగా విధిస్తారు. దేశంలో రోజురోజుకు ఆహార పదార్థాల వృథా పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 2012 నుంచి దేశంలో ఆహార పదార్థాల వృథాపై అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇటీవల వెలువడిన 'ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021' ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2019లో 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయింది. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో ఇది 17శాతం కావడం గమనార్హం. భారత్ విషయానికి వస్తే మన దేశంలో ఏటా 68 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు వెల్లడైంది. భారత్‌లో తలసరిగా ఒక ఇంటి నుంచి ఏటా 50కిలోల ఆహారం వృథా చేస్తున్నట్లు తేలింది. ఈ జాబితాలో నైజీరియా,గ్రీస్,సౌదీ అరేబియా,ఆస్ట్రేలియా,కెన్యా,మెక్సికో దేశాలు టాప్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications